లాహోర్: పాకిస్తాన్‌లో భద్రత పైన అనుమానం నేపథ్యంలో వివిధ క్రికెట్ జట్లు ఆ దేశంలో పర్యటించేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా నష్టపోతోంది. ఇతర దేశ జట్లు తమ దేశంలో పర్యటించేలా చేసేందుకు పాకిస్తాన్ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా పీసీబీ నాలుగు బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కొనుగోలు చేసింది. 2009లో పాకిస్తాన్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్లను తీసుకువెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు ఆటగాళ్లు గాయపడ్డారు.

ఇద్దరు సామాన్య పౌరులు, ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అప్పటి నుంచి పాక్ వెళ్లేందుకు ఇతర దేశాల క్రికెట్ జట్లు వెనుకాడుతున్నాయి. 2015లో మాత్రం జింబాబ్వే పాక్‌లో ప్రయటించింది. అప్పుడు జింబాబ్వే పైన పీసీబీ, ఆటగాళ్లు, మాజీలు ప్రశంసలు కురిపించారు.
అది మినహా ఏ జట్టు కూడా ఈ ఏడేళ్లలో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో తాము ఆతిథ్యం ఇవ్వాల్సిన మ్యాచులకు యూఏఈని వేదికగా పాక్ ఎంచుకుంది. ఇప్పుడు పాక్‌లోనే మ్యాచులను పునరుద్దరించేందుకు బస్సులను కొనుగోలు చేసింది.