క్రిస్ట్‌చర్చ్: వెస్టిండీస్‌తో శనివారం ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచులో పాకిస్తాన్ జట్టు చెత్త రికార్డును సృష్టించింది. వెస్టిండీస్ తన ముందు ఉంచిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ ఏ సందర్భంలో కూడా పోటీ ఇవ్వలేదు.
బౌలింగులోనూ బ్యాటింగ్‌లోనూ సరిజోడుగా నిలువలేకపోయింది. పైగా బ్యాటింగులో మరీ చెత్త రికార్డును మూటగట్టుకుంది. పాకిస్తాన్ సున్నా పరుగులకే ఓ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు చేజూర్చుకుంది. వన్డే క్రికెట్‌లో నాలుగు వికెట్ల నష్టానికి ఇప్పటి వరకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం.

జింబాబ్వేతో 2006లో జరిగిన మ్యాచులో కెనడా 4 వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. తాజాగా, పాకిస్తాన్ అంతకన్నా చెత్తగా ఆడింది. దీంతో వన్డేల్లో నాలుగు వికెట్ల నష్టానికి అత్యల్ప స్కోరును సాధించిన చెత్త రికార్డును పాకిస్తాన్ సొంతం చేసుకుంది.
వెస్టిండీస్ బౌలర్ జీరోమీ టైలర్ ప్రారంభంలోనే పాకిస్తాన్‌ను చావు దెబ్బ తీశాడు. టైలర్ వేసిన ఇన్నింగ్సు తొలి ఓవరులోనే పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ ఖాతా కూడా తెరవలేదు. ఓపెనర్ నాజిర్ జంషెడ్ వచ్చిన దారినే పెవిలియన్ దారి పట్టాడు. ఇదే ఓవరులో యూనిస్ ఖాన్ కూడా వెనుదిరిగాడు.
టైలర్ తన తర్వాతి ఓవరులో హరీష్ సొహైల్ వికెట్ కూల్చాడు. ఆ తర్వాత వెస్టిండీస్ బౌలర్ హోల్డర్ షెహజాద్‌ను వెనక్కి పంపించాడు. దీంతో పాకిస్తాన్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. నలుగురు కూడా క్యాచవుట్ అయ్యారు. ఆ తర్వాత మిస్బా, అక్మల్, మక్సూద్, అఫ్రిదీ ఎంత కష్టపడినా ఫలితం సున్నాకే వచ్చింది.