
కోహ్లీని మాకు ఇచ్చేయండి:
పాక్‌కి చెందిన రిజ్లా రెహాన్ అనే యువతి 'ముఝే విరాట్ దేదో, ప్లీజ్ ముఝే విరాట్ దేదో (విరాట్ కోహ్లీని మాకు ఇచ్చేయండి)' అంటూ 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో సంచలనం సృష్టించింది. దాంతో సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. పాక్ దేశానికి చెందిన రిజ్లా ఇంగ్లండ్‌లో నివసిస్తుంది. క్రికెట్‌ను ఆమె అమితంగా ఇష్టపడుతుంది. అందులోనూ భారత్, పాక్ తలపడే మ్యాచులకు తప్పకుండా హాజరవుతుంది. ఇలా సాధారణ అమ్మాయిలే కాదు సెలెబ్రిటీలు కూడా విరాట్ కోహ్లీకి ఫిదా అవుతున్నారు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య షామియా ఆర్జూ కూడా కోహ్లీకి పెద్ద ఫ్యాన్ అని తాజాగా వెలుగులోకి వచ్చింది.

కోహ్లీ నా ఫేవరెట్ బ్యాట్స్‌మెన్:
తాజాగా సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) ద్వారా హసన్ అలీ భార్య షామియా ఆర్జూ అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. 'నీ ఫేవరెట్ బౌలర్ కచ్చితంగా హసన్ అలీ అయ్యుంటాడు. మరి నీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎవరు.?' అని షామియాని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. 'విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ బ్యాట్స్‌మెన్' అని షామియా ఒక్క ముక్కలో తేల్చేసింది. కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ బాగుంటుందని, ప్రతి మ్యాచులో పరుగులు చేయాలనే అతని తపన ఎంతో నచ్చుతుందని షామియా పేర్కొంది. జట్టు గెలుపుకోసమే పోరాడే కోహ్లీ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. హసన్ అలీని 2019లో షామియా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా:
నిజానికి షామియా ఆర్జూ వాళ్లది భారత్‌లోని హర్యానా. వాళ్ల ఫ్యామిలీ ప్రస్తుతం న్యూఢిల్లీలో నివాసం ఉంటోంది. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న షామియాని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ మూడేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాడు. కొన్ని రోజులు మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పట్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ కూడా ఇచ్చారు. అలీ పాక్ తరఫున 13 టెస్టులు, 54 వన్డేలు, 36 టీ20లు ఆడాడు.

70 సెంచరీలు:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 రన్స్ బాదాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications
