ముల్తాన్ కా సుల్తాన్: బాబర్ ఆజమ్ హ్యాట్రిక్ సెంచరీ: తొలి వన్డే రిజల్ట్ ఇదీ

ఇస్లామాబాద్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే ఇంటర్నేషనల్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. ఈ హయ్యెస్ట్ స్కోరింగ్ మ్యాచ్‌లో విండీస్ జట్టును అయిదు వికెట్ల తేడాతో ఓడించింది. రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు నమోదయ్యాయి. వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ షై హోప్, పాక్ టీమ్‌లో కేప్టెన్ బాబర్ ఆజమ్ వందేసి చొప్పున పరుగులు బాదారు. ఇన్నింగ్ చివర్లో టీ20 తరహాలో భారీ షాట్లతో జట్టును గెలిపించిన పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఖుష్‌దిల్ షా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
300 ప్లస్..
మూడు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌కు ముల్తాన్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ టీమ్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఓపెనర్ షై హోప్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో అతనికిది 12వ సెంచరీ. 134 బంతుల్లో ఒక సిక్సర్, 15 ఫోర్లతో 127 పరుగులు చేశాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ షమారా బ్రూక్స్ 83 బంతుల్లో 70, రౌమన్ పావెల్ 23 బంతుల్లో 32 పరుగులు చేశారు.
పూరన్ మళ్లీ..
కేప్టెన్ నికొలస్ పూరన్.. మళ్లీ విఫలం అయ్యాడు. 16 బంతుల్లో మూడు సిక్సర్లతో 21 పరుగులు మాత్రమే చేశాడు. చివర్లో రొమారియో షెప్పర్డ్ మెరుపులు మెరిపించాడు. రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీనితో విండీస్.. స్కోర్ బోర్డ్ 300లను దాటింది. పాకిస్తాన్ బౌలర్లల్లో హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. షహీన్ షా అఫ్రిది 2, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
బ్యాటింగ్ జోరు..
306 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్తాన్.. ప్రారంభ ఓవర్లలోనే వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్ ఏడో ఓవర్‌లో జట్టు స్కోరు 26 పరుగుల వద్ద ఫకర్ జమాన్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇమాముల్ హక్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. 129 పరుగుల వద్ద ఇమాముల్ హక్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లందరూ భారీ స్కోర్లు బాదేయడంతో లక్ష్యం చిన్నదయింది. మహ్మద్ రిజ్వాన్ 61 బంతుల్లో 59, ఖుష్‌దిల్ షా 23 బంతుల్లో 41 పరుగులు చేశారు.
హ్యాట్రిక్ సెంచరీ..
బాబర్ ఆజమ్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. 107 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అతనికి ఇది 17వ సెంచరీ. అతని ఇన్నింగ్‌లో తొమ్మిది ఫోర్లు నమోదయ్యాయి. చివరి అయిదు వన్డేల్లో నాలుగు సెంచరీలను బాదాడీ పాక్ కేప్టెన్. చివరి అయిదు వన్డేల్లో 158, 57, 114, 105, 103.. ఇదీ అతని స్కోర్. దీన్ని బట్టి అతని ఫామ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఇది అతనికి హ్యాట్రిక్ సెంచరీ. వెస్టిండీస్ బౌలర్లలో అల్జరీ జోసెఫ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. జేడెన్ సీల్స్, రొమారియో షెప్పర్డ్, అకీల్ హొస్సెన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications