పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబరమ్ ఆజమ్ పై వేటు పడింది. టీ20 వరల్డ్ కప్ లో వైఫల్యమే అతని పాలిట శాపంలా మారింది. ఏకంగా జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. త్వరలో బంగ్లాదేశ్ లో పర్యటించబోయే పాకిస్తాన్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఈ సిరీస్ కోసం మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది కేప్టెన్ గా అపాయింట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్ లో బాబర్ ఆజమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదతను. ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజమ్ బ్యాటింగ్ యావరేజ్ జస్ట్ 22.75 మాత్రమే. నాలుగు ఇన్నింగ్స్‌లలో అతను 91 పరుగులే చేశాడు. వ్యక్తిగత అత్యధికం స్కోరు.. 46. గత ఏడాది కూడా అతన్ని ఫెయిల్యూర్స్ వెంటాడాయి. 2025లో 17 ఇన్నింగ్స్ లల్లో 34 బ్యాటింగ్ యావరేజ్ ను నమోదు చేశాడు. అతను చేసింది 544 పరుగులు. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గత ఏడాది వన్డేల్లో బాబర్ బ్యాటింగ్ సగటు 77.16.

దీంతో అతనికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని భావించినట్టుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. బంగ్లాదేశ్‌తో జరిగే వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ నుండి తప్పించింది. దీంతో పాకిస్తాన్ జట్టులో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, మహమ్మద్ ఘాజీ ఘోరీ, సద్ మసూద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, షమీల్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఇది పాకిస్తాన్ క్రికెట్‌లో యువరక్తాన్ని నింపినట్టయింది.
సదాకత్.. ఈ జట్టులో ప్రధాన ఆకర్షణ. 2025 రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 20 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'. అతను మొత్తం అయిదు ఇన్నింగ్స్‌లలో 129 బ్యాటింగ్ యావరేజ్ ను నమోదు చేశాడు. 177.93 స్ట్రైక్ రేట్‌తో 258 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఏడు వికెట్లు కూడా పడగొట్టాడు.
ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది కేప్టెన్‌గా కొనసాగుతుండగా సీనియర్లు మహమ్మద్ రిజ్వాన్, హరీస్ రవూఫ్ లకు కూడా జట్టులో చోటు దక్కింది. టీ20 ప్రపంచ కప్ అత్యధిక పరుగులు సాధించి రికార్డు సృష్టించిన ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు సిరీస్‌లో అవకాశం లభించింది. ఈ టోర్నమెంట్‌లో ఫర్హాన్ ఆరు ఇన్నింగ్స్‌లలో 76.60 సగటు, 160.25 స్ట్రైక్ రేట్‌తో 383 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఒకే టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఈ నెల 11న ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కోసం ఎంపికైన జట్టులో- షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రౌఫ్, హుస్సేన్ తలత్, మాజ్ సదాకత్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహమ్మద్ వసీం జూనియర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ ఆఘా, షమీల్ హుస్సేన్ ఉన్నారు.