భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్తోంది. ఆసియా కప్ 2023 విషయంలో బీసీసీఐ చేసిన దానికి పగ తీర్చుకోవాలని పీసీబీ ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆసియా కప్‌ను హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించాలని పట్టు నిలబెట్టుకున్న పాకిస్తాన్.. వన్డే వరల్డ్ కప్ విషయంలో కూడా కొన్ని ఆంక్షలు పెడుతోంది.
వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే షెడ్యూల్ రెడీ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకటించేందుకు కూడా బీసీసీఐ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఐసీసీకి ఈ షెడ్యూల్ పంపింది. అయితే దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. భారత్‌తో తాము ఆడే మ్యాచ్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆడేందుకు తాము సిద్ధంగా లేమని ఇన్ని రోజులు పీసీబీ పట్టుబట్టింది.

ఇప్పుడు మరో వేదికపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీన్ని చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ వేదిక మార్చాలని పీసీబీ అంటోంది. ఆఫ్ఘనిస్తాన్‌ను చెన్నైలో ఎదుర్కోవడానికి తాము సుముఖంగా లేమని పీసీబీ చెప్తోందట. ఆఫ్ఘన్ స్పిన్ బౌలింగ్ బలంగా ఉండటం వల్లనే ఇలా పీసీబీ భయపడుతోందని సమాచారం.
ఈ టోర్నీలో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాను పాక్ ఎదుర్కొంటుంది. ఈ వేదికను కావాలంటే చెన్నైకి మార్చాలని, ఆఫ్ఘాన్ మ్యాచ్‌ను బెంగళూరుకు మార్చాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. 'బీసీసీఐ ఇచ్చిన షెడ్యూల్ డ్రాప్ట్‌ను సెలెక్టర్లు, నిపుణులకు పీసీబీ పంపించింది. అయితే వాళ్లు మాత్రం కొన్ని మ్యాచులు, వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు' అని పీసీబీకి సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి.

'ఆఫ్ఘనిస్తాన్‌తో చెపాక్‌లో, ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగే మ్యాచులపై ముఖ్యంగా సెలెక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఈ వేదికలు రెండింటినీ మార్చాలని బీసీసీఐని అడగాలని అనుకుంటున్నాం. పాక్ మ్యాచ్‌ను బెంగళూరుకు, ఆసీస్ మ్యాచ్‌ను చెన్నైకి మార్చాలని అడగాలని వాళ్లు సూచించారు' అని పీసీబీ వర్గాలు అంటున్నాయి.