
రెండు పాయింట్లతో..
గ్రూప్ 2లో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది బాబర్ ఆజమ్ సేన. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కదాంట్లోనే.. అది కూడా నెదర్లాండ్స్‌పై. కిందటి నెల 30వ తేదీన జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో నెగ్గడం వల్ల కొంతవరకు తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోగలిగింది. అంతకుముందు భారత్, జింబాబ్వే చేతుల్లో మట్టి కరిచింది. మూడు మ్యాచ్‌లు - రెండు పరాజయాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఉన్నది రెండు పాయింట్లే.

కలవరపెడుతున్న ఆజమ్ ఫామ్..
పాకిస్తాన్ తురుఫుముక్క కేప్టెన్ బాబర్ ఆజమ్ ఫామ్ ఆ జట్టును ఆందోళనలోకి నెట్టేసింది. ఏ మాత్రం భారీ స్కోర్ చేయలేక చేతులెత్తేశాడు బాబర్. పాకిస్తాన్ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన అతను ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో కనీస స్థాయిలో ఆడలేకపోతోన్నాడు. నిజానికి బాబర్ టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్. ఈ ఫార్మట్‌లో అతనికి అద్భుతమైన ట్రాక్ ఉంది. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఈ మూడు మ్యాచ్‌లల్లో అతను చేసిన స్కోర్ ఎనిమిదంటే ఎనిమిదే. భారత్‌పై డకౌట్ అయ్యాడు. జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై నాలుగు చొప్పున పరుగులు చేశాడు.

అదే బాటలో బ్యాటర్లు..
తోటి బ్యాటర్లు కూడా అదే దారిలో సాగుతున్నారు. ఏ ఒక్కరు కూడా నిలకడగా పరుగులను సాధించట్లేదు. భారీ భాగస్వామ్యాలు నమోదు కావట్లేదు. భారత్‌పై హాఫ్ సెంచరీలు చేసిన షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ ఆ తరువాతి మ్యాచ్‌లల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. మహ్మద్ రిజ్వాన్‌దీ అదే పరిస్థితి. గల్లీ టీమ్‌ను వెంటబెట్టుకుని బాబర్ ఆజమ్.. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌కు వెళ్లాడంటూ ఇప్పటికే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.

తుదిజట్టు అంచనాలివే..
పాకిస్తాన్ తుదిజట్టులో- బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హ్యరీస్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా ఆడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రిలీ రోసౌ, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహారాజ్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగీ ఎన్గిడి/తబ్రేజ్ షామ్సీ, కగిసో రబడ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












