బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ దుమ్ము రేపింది. స్కోర్ బోర్డును 400 పరుగులను దాటించింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్ చెలరేగారు. పాకిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. ఒక్కో బౌలర్ నుంచి ఓవర్‌కు ఆరు, అంతకుమించి పరుగులను పిండుకున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది న్యూజిలాండ్. తొలి ఓవర్ నుంచి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆరుకు పైగా రన్ రేట్‌ను కొనసాగించింది. 68 పరుగుల వద్ద డెవాన్ కాన్వే రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. వెనకడుగు వేయలేదు. రచిన్ రవీంద్ర, కేప్టెన్ కేన్ విలియమ్సన్ ధాటిగా ఆడారు.

ఈ క్రమంలో రచిన్ రవీంద్ర తన మూడో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 108 పరుగులకు అవుట్ అయ్యాడు. అటు మరో ఎండ్‌లో కేన్ విలియమ్సన్ 95 పరుగులు చేశాడు. స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. రెండో వికెట్ భాగస్వామ్యానికి 180 పరుగులను జోడించారు. జట్టు స్కోరు 248 వద్ద ఉన్నప్పుడు కేన్ విలియమ్సన్ అవుట్ అయ్యాడు.
ఆ వెంటనే రచిన్ రవీంద్ర వికెట్ కూడా పడినప్పటికీ.. న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ వేగం ఎక్కడా మందగించలేదు. మిగిలిన బ్యాటర్లందరూ ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది న్యూజిలాండ్. 402 పరుగుల లక్ష్యంతో పాకిస్తాన్ బరిలోకి దిగాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. అతని 10 ఓవర్ల కోటాలో 90 పరుగులు రాబట్టుకున్నారు న్యూజిలాండ్ బ్యాటర్లు. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ బౌలింగ్ అతనిదే. ఓ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తరఫున ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 10 ఓవర్లల్లో 90 పరుగులను ఇచ్చుకున్న దాఖలాలు లేవు.
ఇదే మ్యాచ్‌లో హ్యారిస్ రవూఫ్ తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చుకున్నాడు. ఏ బౌలర్ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గనే లేదు. ఒకరితో ఒకరు పోటీ పడ్డారా? అన్నట్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. హసన్ అలీ- 82, మహ్మద్ వసీం- 60, ఎనిమిది ఓవర్లల్లో ఇఫ్తికర్ అహ్మద్- 55, రెండు ఓవర్లల్లో ఆఘా సల్మాన్ 21 పరుగులు ఇచ్చారు.