
అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా మంగళవారం రాత్రి నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దాంతో పాక్ 45 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. నమీబియా బ్యాటర్ డేవిడ్ వైజ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీఫన్ బార్డ్ (29), క్రేగ్ విలియమ్స్ (40) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్, హరీస్ రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. పాక్ ఇప్పటికే సూపర్ 12లో నాలుగు విజయాలు అందుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో నమీబియాకు శుభారంభం దక్కలేదు. మైకెల్ వాన్ లింగెన్ (4) రెండో ఓవర్లోనే ఔట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ స్టీఫన్ బార్డ్.. క్రేగ్ విలియమ్స్ అండతో జట్టును ఆదుకున్నాడు. ఈ జోడి స్ట్రైక్ రొటేట్ చేస్తూ నమీబియాను లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. అయితే బార్డ్, విలియమ్స్ ఔట్ అవ్వడంతో నమీబియా ఇన్నింగ్స్ గతితప్పింది. ఈ సమయంలో డేవిడ్ (31 బంతుల్లో 43) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. డేవిడ్ చివరి ఓవర్‌లో రెచ్చిపోయాడు. అఫ్రీన్ బౌలింగ్‌లో ఫోర్లు, సిక్స్ కొట్టి నమీబియా స్కోర్‌ను పెంచాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వాసిమ్‌తలో వికెట్ పడగొట్టారు. పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌ను 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' వరించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 రన్స్ చేసింది. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ఎక్కువగా బౌండరీల జోలికి పోకుండా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు చేశారు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 59 పరుగులు మాత్రమే చేశారు. అజామ్, రిజ్వాన్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. రుబెన్ ట్రంపుల్మన్ వేసిన 12వ ఓవర్లో బాబర్ అజామ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచి దూకుడుగా ఆడుతున్న సమయంలో డేవిడ్ వైజ్ వేసిన 15వ ఓవర్లో జాన్ ఫ్రై లింక్‌కి చిక్కి బాబర్ పెవిలియన్ చేరాడు. ఆజమ్ 49 బంతుల్లో 70 పరుగులు చేశాడు.
బాబర్ ఆజమ్ అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డ్ హిట్టర్ ఫకార్ జమాన్ విఫలమయ్యాడు. ఐదు బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఫకార్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన వెటరన్ బ్యాటర్ మహమ్మద్ హఫీజ్ (32) ధాటిగా ఆడాడు. వచ్చిరావడంతోనే హఫీజ్ బౌండరీలు బాది పాక్ ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. మరోవైపు మహమ్మద్ రిజ్వాన్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అయితే నమీబియా బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేసినా.. ఆఖర్లో మాత్రం తేలిపోయారు. చివరి ఓవర్లో చెలరేగిన రిజ్వాన్ ఏకంగా ఐదు బౌండరీలు (ఓ సిక్స్, నాలుగు ఫోర్లు) బాదాడు. దీంతో పాకిస్థాన్ భారీగా పరుగులు రాబట్టింది. రిజ్వాన్ 50 బంతుల్లో 79 పరుగులు చేసి నాట్ అవుట్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైజ్, జాన్ ఫ్రై లింక్ తలో వికెట్ తీశారు.