అడిలైడ్: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా శ్రోతలను, టీవీ ప్రేక్షకులను అలరించారు. ఏదో ఆకర్షణ కోసం కాకుండా ఆయన క్రికెట్ వ్యాఖ్యానం కాస్తా నిపుణుడైన వ్యాఖ్యాత మాదిరిగానే చేశాడు. బౌలర్ వేసిన బంతి ఎలా ఎగిరింది, బ్యాట్స్‌మన్ ఎలా షాట్ కొట్టారు వంటి విషయాల గురించి చెప్పేటప్పుడు కాస్తా వృత్తినిపుణుడైన వ్యాఖ్యాత మాదిరిగా సాంకేతిక విషయాలను కూడా పరిగణలోనికి తీసుకుని మాట్లాడాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ క్రికటర్ మొహిందర్ అమర్నాథ్‌లతో కలిసి ఆయన క్రికెట్ వ్యాఖ్యానం వినిపించాడు. శిఖర్ ధావన్ ప్రాక్టీస్ చేసిన దృశ్యాన్ని ప్రసారం చేసినప్పుడు - క్రీడాకారులకు, సినీ నటులకు శరీర దార్ఢ్యం ముఖ్యమని చెప్పారు. అయితే, శిఖర్ ధావన్ ప్రాక్టీస్‌లో ఒక్క స్టూల్స్ మీది నుంచి మరో స్టూల్ మీదికి దూకుతూ ప్రాక్టీస్ చేసినప్పుడు సినీ నటులు కూడా ఫిట్నెస్‌తో ఉండడానికి కృషి చేయాల్సి ఉంటుదని చెప్పారు

బంతి బాగా వేగంగా వచ్చి పైనుంచి వెళ్లిందంటూ ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఇతర విషయాలను జోడించారు. బహుతీ ఖూబ్ సూరత్ షాట్ అంటూ మంచి షాట్ కొట్టినప్పుడు అన్నారు. పాకిస్తాన్ బౌలర్ భారత బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టిన బంతి వేసినప్పుడు అచ్చీ గేంద్ అంటూ మెచ్చుకున్నారు. శిఖర్ ధావన్ సిక్సర్ కొట్టినప్పుడు బ్యూటిఫుల్ షాట్ అంటూ బంతి పైకి ఎక్కువగా లేవకున్నా బాగా ఆడాడని మెచ్చుకున్నారు.
భారత్ ఓవరుకు 8 పరుగుల రన్ రేట్ సాధిస్తే విజయానికి బాటలు వేసుకుంటుందని చెప్పారు. ఇంత కాలం మీరు క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేస్తున్నారు, అందులోని మోటివేషన్ ఏమిటని మొహిందర్ అమర్నాథ్ అమితాబ్‌ను అడిగితే, కళాకారుడిగా అది అవసరమని అన్నారు. కెరీర్, వృత్తి ముఖ్యంగా భావించే మీరు క్రికెట్ వ్యాఖ్యానానికి వచ్చారని అంటే, దేశం కోసం క్రీడాకారులు అడుతున్నప్పుడు ఆ మాత్రం బాధ్యతగా ఉండడం అవసరమని అమితాబ్ అన్నారు. మీలాంటి వారితో కూర్చునే సమయం అత్యంత అరుదుగా దొరుకుతుందని, ఇలా కూర్చునందుకు తనకు ఆనందంగా ఉందని అమితాబ్ ఇతర వ్యాఖ్యాతలను ఉద్దేశించి అన్నారు.