సొంతగడ్డపై 1338 రోజుల తర్వాత టెస్టు విజయాన్ని అందుకున్న పాకిస్థాన్.. ఈసారి టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. రావల్పిండి వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో క్రమంగా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 267 పరుగులకు ఆలౌట్ చేసింది. జేమీ స్మిత్ (89; 119 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్.
పాకిస్థాన్ స్పిన్నర్లే పది వికెట్లు తీశారు. సజిద్ ఖాన్ ఆరు వికెట్లు, నోమన్ అలీ మూడు, జహీద్ మహ్మూద్ ఒక్క వికెట్ పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు ఒక్క బంతి కూడా వేయలేదు. సజిద్ 29.2 ఓవర్లు వేయగా, నోమన్ 28, జహీద్ 10 ఓవర్లు, అఘూ సల్మాన్ ఒక్క ఓవర్ వేశారు. అయితే టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లతో కాకుండా పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం గత 142 ఏళ్లలో ఇదే తొలిసారి.

అంతకముందు 1882లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లతోనే ఇంగ్లండ్‌కు బౌలింగ్ చేసింది. జోయ్ పామర్, ఎడ్విన్ ఎవాన్స్ కలిసి 115 ఓవర్లు బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను 133 పరుగులకు ఆలౌట్ చేశారు. 142 ఏళ్లలో ఏ జట్టు చేయని ఈ వ్యూహాన్ని పాకిస్థాన్ ఇప్పుడు అమలుచేసింది. పాకిస్థాన్ జట్టులో ఫాస్ట్ బౌలర్ అమీర్ జమాల్ ఉన్నాడు. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అతనికి బంతికి అందివ్వలేదు.
కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. సౌద్ షకీల్ (41; 82 బంతుల్లో, 3 ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (12; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ కంటే పాక్ ఇంకా 145 పరుగుల వెనుకంజలో ఉంది. షోయబ్ బషీర్ రెండు వికెట్లు, జాక్ లీచ్, గస్ అట్కిన్సన్ చెరో వికెట్ తీశారు. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు ఇంగ్లండ్, రెండో టెస్టును పాకిస్థాన్ గెలిచిన సంగతి తెలిసిందే.