సొంతగడ్డపై టెస్టు ఫార్మాట్‌లో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. 1338 రోజుల తర్వాత తొలిసారి గెలుపు రుచి చూసింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో నెగ్గి మొత్తంగా పరువు కాపాడుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో వరుసగా 11 టెస్టుల్లో గెలుపులేని పేలవమైన రికార్డుకు పాక్ బ్రేక్‌లు వేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
చేతిలో ఎనిమిది వికెట్లతో విజయానికి 261 పరుగుల లక్ష్యంగా 36/2తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ 144 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ స్పిన్నర్లు నోమన్ అలీ (8/46), సజిద్ ఖాన్ (2/93) ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. తొలి టెస్టు ఆడిన పిచ్‌పైనే రెండో టెస్టు ఆడటంతో ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు చెలరేగిపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్ 20 వికెట్లను పాక్ స్పిన్నర్లు నోమ్, సజిద్ తీశారు.

శుక్రవారం ఆట ఆరంభమైన కాసేపటికే ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. ఒలీ పోప్ (22)ను సజిద్ ఔట్ చేశాడు. ఆ తర్వాత నోమన్ అలీ వికెట్ల వేట ప్రారంభించాడు. ప్రమాదకర బ్యాటర్లు జో రూట్ (18), హ్యారీ బ్రూక్ (16)ను నోమన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇంగ్లిష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెన్ స్టోక్స్ (37), బ్రైడన్ కార్సె (27) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 366 పరుగుల భారీ స్కోరు చేసింది. కమ్రాన్ గులామ్ (118) సెంచరీ సాధించాడు. జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (114) శతకం బాదాడు. సజిద్ ఖాన్ ఏడు, నోమన్ మూడు వికెట్లు తీశారు. అనంతరం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసింది. అఘూ సల్మాన్ (63) టాప్ స్కోరర్. షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు తీశారు. ఛేదనలో ఇంగ్లండ్ 33.3 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది.