దాదాపు రెండేళ్లుగా స్వదేశంలో విజయానికి దూరమైన పాకిస్థాన్ తిరిగి గెలుపు బాట పట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్టులకు అతన్ని ఎంపిక చేయలేదు. బాబర్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను కూడా పక్కనపెట్టింది.
అయితే బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని క్రికెటర్లు, మాజీలు వ్యతిరేకించారు. బాబర్‌ను జట్టు నుంచి తప్పించడం ట్వీట్ చేసిన ఫకర్ జమాన్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు కూడా పంపింది. కాగా, ఈ స్థితిలో బాబర్ అజామ్ స్థానంలో జట్టులోకి వచ్చిన కమ్రాన్ గులామ్ సెంచరీతో కదం తొక్కాడు. అరంగేట్ర మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరులో ఆకట్టుకున్నాడు.

19 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయి జట్టు కష్టాల్లో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన కమ్రాన్ శతకం సాధించాడు. 224 బంతుల్లో 118 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. అయితే సెలక్టర్ల నిర్ణయం తప్పు అని మాజీలు విమర్శిస్తున్న ఈ స్థితిలో కమ్రాన్ సెంచరీ సాధించడం విశేషం. దీంతో బాబర్ అజామ్ స్థానం మరింత ప్రమాదంలో పడిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమ్రాన్ సెంచరీ బాబర్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిందని అంటున్నారు.
2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు.
ఇక పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసేసరికి పాకిస్థాన్ అయిదు వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. కమ్రాన్ గులామ్ (118), సయిమ్ అయుబ్ (77; 160 బంతుల్లో, 7 ఫోర్లు) రాణించారు. జాక్ లీచ్ రెండు వికెట్లు, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్సె, మాథ్యూ పాట్స్, షోయబ్ బసీర్ తలో వికెట్ తీశారు. మహ్మద్ రిజ్వాన్ (37 బ్యాటింగ్; 89 బంతుల్లో, 4 ఫోర్లు), అఘూ సల్మాన్ (5 బ్యాటింగ్; 19 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.