ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు అయిన గురువారం ఆటలో ఇంగ్లిష్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను 823/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్ 152/6 స్కోరుతో పోరాడుతోంది. మిగిలిన శుక్రవారం ఆటలో పాక్ ఓటమి నుంచి తప్పించుకోవడానికి గొప్ప పోరాటం చేయాల్సి ఉంది.
అయితే లెగ్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో పాకిస్థాన్ మరో మూడు వికెట్లు కోల్పోయినా ఆలౌటయ్యే అవకాశం ఉంది. కాగా, ఓవర్‌నైట్ స్కోరు 492/3తో ఇవాళ ఆట ఆరంభించిన ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్ 454 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో నాలుగో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసిన జోడీగా రికార్డులకెక్కింది.

జో రూట్ 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. 17 ఫోర్లు బాదాడు. హ్యారీ బ్రూక్ 322 బంతుల్లో 317 పరుగులు సాధించాడు. 29 ఫోర్లు, మూడు సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జో రూట్ ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ బ్రూక్ 300 మార్క్‌ను అందుకున్నాడు. 310 బంతుల్లో ఈ ఘనత సాధించిన బ్రూక్ బంతుల పరంగా ట్రిపుల్ సెంచరీ అత్యంత వేగంగా సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు.
మరోవైపు టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో జట్టుగా ఇంగ్లండ్ రికార్డులకెక్కింది. కాగా, 267 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. అబ్దుల్లా షఫికిని క్రిస్ వోక్స్ గోల్డెన్ డకౌట్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లు ధాటికి పాక్ 59 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అఘూ సల్మాన్ (41 నాటౌట్)తో కలిసి సౌద్ షకీల్ (29) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
కానీ సౌద్ షకీల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేపోయాడు. జాక్ లీచ్ అతన్ని పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 82/6తో పాక్ కష్టాల్లో పడింది. అయితే అమీర్ జమాల్ (27 నాటౌట్)తో కలిసి అఘూ సల్మాన్ మరో వికెట్ పడకుండా స్కోరుబోర్డు ముందుకు నడిపిస్తున్నాడు. పాకిస్థాన్ ఇంకా 115 పరుగుల వెనుకంజలో ఉంది.