
అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 ముగింపు రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగించింది. సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంది. సూపర్ 12 దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిపోయింది. తన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో మట్టి కరిచింది దక్షిణాఫ్రికా. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.
ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆడిన తీరు - ఓ అద్భుతం. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. పరాజయాన్ని చవి చూపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయిన తీరు చూసి తీరాల్సిందే. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరే అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ అడిలైడ్ ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో ఆడుతోంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్ ముగిసింది కూడా. తన ప్రత్యర్థి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్- నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మినహా మరెవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. 48 బంతుల్లో ఏడు ఫోర్లతో 54 పరుగులు చేశాడు శాంటో.
డాషింగ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. భారీ స్కోర్ అందుకోలేకపోయాడు. 10 పరుగులకే షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో షాన్ మసూద్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సౌమ్యా సర్కార్ - 20, అఫీఫ్ హొస్సేన్ - 24, మొసాద్దెక్ హొస్సేన్ - 5, నూరుల్ హసన్ - 0, తస్కిన్ అహ్మద్ -1, నాసుమ్ అహ్మద్- 7 పరుగులు చేశారు. కేప్టెన్ షకీబుల్ హసన్‌ది గోల్డెన్ డక్. షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఎల్బీడబ్ల్యూగా బలి అయ్యాడు.
పాకిస్తాన్ ఏస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి నలుగురు బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. లిట్టన్ దాస్, మొసాద్దెక్ హొస్సేన్‌ను నూరుల్ హసన్, తస్కిన్ అహ్మద్‌ను అవుట్ చేశాడు. షాదబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. హ్యారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్ ఒక్కో వికెట్‌ను నేలకూల్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.