ఆసియా కప్ 2023 వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఈ టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదనకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. దీనిపై పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ కూడా హర్షం వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్‌కు జట్టును పంపడానికి బీసీసీఐ నిరాకరించడంపై మియాందాద్ మండిపడ్డాడు. భారత్ అంత మంకుపట్టు పడితే పాకిస్తాన్ కూడా ఆ దేశానికి వెళ్లకూడదన్నాడు. '2012లో ఆ తర్వాత 2016లో కూడా భారత్‌కు పాక్ జట్టు వెళ్లింది. ఇప్పుడు అదే పద్ధతిలో భారత జట్టు కూడా ఇక్కడకు రావాలి. కానీ అలా జరగలేదు. కాబట్టి నేనే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. పాక్‌ను భారత్‌కు పంపను. అది వరల్డ్ కప్ అయినా సరే' అని మియాందాద్ తేల్చిచెప్పాడు.

'మేం భారత్‌తో ఆడేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. వాళ్లు కూడా అదే భావనతో ఉండాలి కదా. కానీ భారత్ ఎప్పుడూ అలా ప్రవర్తించదు. ఏం?' అని ప్రశ్నించాడు. అలాగే భారత్‌తో ఆడాల్సిన అవసరం కూడా పాకిస్తాన్‌కు లేదని మియాందాద్ పేర్కొన్నాడు. భారత్ కన్నా ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ పెద్దదని అతను అభిప్రాయపడ్డాడు. కాబట్టి భారత్ వెళ్లకపోయినా నష్టం ఏమీ ఉండదన్నాడు.
'భారత్ కన్నా పాకిస్తాన్ క్రికెట్ పెద్దది, గొప్పది. మనం ఇంకా నాణ్యమైన ఆటగాళ్లను బయటకు తీస్తూనే ఉన్నాం. అలాంటప్పుడు మనం భారత్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముంది? వెళ్లకపోయినా నష్టం ఏమీ లేదు' అని మియాందాద్ అన్నాడు. ఇక హైబ్రీడ్ మోడల్ గురించి మాట్లాడుతూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదేం లెక్కో తనకు అర్థం కాలేదన్నాడు.
'ఆసియా కప్ కోసం భారత జట్టును ఇక్కడకు బీసీసీఐ పంపదని ముందే మనకు తెలుసు. ఇకనైనా మనం బలమైన స్టాండ్ తీసుకోవాలి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. మన పొరుగున ఏ దేశం ఉండాలో మన చేతుల్లో లేదు. కాబట్టి ఉన్న వాళ్లం మంచిగా ఉండాలి. క్రికెట్ అనేది ప్రజలను దగ్గర చేసే క్రీడ. దీని వల్ల దేశాల మధ్య ఉన్న భేదాభ్రియాలు కూడా సమసిపోతాయి' అని చెప్పాడీ 66 ఏళ్ల పాక్ మాజీ క్రికెటర్.