ఆసియా కప్‌కు ముందు అన్ని టీమ్స్ కూడా తమ బలాబలాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు ఇతర ఫార్మాట్ సిరీసులు ఆడుతుండగా.. పాకిస్తాన్ మాత్రం వన్డే ఫార్మాట్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మంచి స్కోరు చేసింది. అయితే ఈ టీంకు సరైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ బాబర్ ఆజమ్, పఖర్ జమాన్ ఇద్దరూ చాలా దారుణంగా విఫలమయ్యారు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో బాబర్ అద్భుతమైన ఫామ్ కనబరిచిన సంగతి తెలిసిందే.

అయినా సరే ఈ సిరీసులో తన ఫామ్‌ను బాబర్ కంటిన్యూ చేయలేకపోయాడు. కనీసం ఖాతా తెరవకుండా డకౌట్ అయ్యాడు. ఇది వన్డే ఫార్మాట్‌లో బాబర్‌కు నాలుగో డకౌట్. టీం కెప్టెన్‌గా రెండోది. ఈ క్రమంలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, అజహర్ అలీ, యూనిస్ ఖాన్ తదితరుల రికార్డును బాబర్ సమం చేశాడు.
అయితే బాబర్‌ను అవుట్ చేసిన ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ కూడా అరుదైన ఘనత సాధించాడు. బాబర్‌ను ఇలా డకౌట్ చేసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ఇలా బాబర్ డకౌట్ అయినా కూడా పాక్ జట్టు పెద్దగా సమస్యలు ఎదుర్కోలేదు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్ రాణించడంతో పాకిస్తాన్ 201 పరుగులు చేసింది.
ఆఫ్గన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ ముగ్గురూ రాణించారు. అయితే ఆ టీం బ్యాటింగ్ విభాగం చాలా దారుణంగా విఫలమైంది. పాక్ పేసర్లు షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్ చెలరేగడంతో ఆఫ్ఘన్ టీం కేవలం 59 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో 9 మంది కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ మొదలవనున్న నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్‌కు వాళ్ల బ్యాటింగ్ పెద్ద సమస్యగా మారింది. పాక్‌పై ఇంత దారుణంగా ఆడిన ఆ టీం.. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో ఎలా ఆడుతుందనేది ప్రశ్న. అదే సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ కూడా స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై ఏమాత్రం రాణిస్తాడో చూడాలి.