For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు

Pacers reduce India to 28/3 after South Africa make 286

హైదరాబాద్: దక్షిణాఫ్రికా, భారత్‌ మధ్య ఫ్రీడం టెస్టు సిరీస్‌ అంచనాలకు తగ్గట్టే ఆసక్తికరంగా ఆరంభమైంది. తొలి టెస్టులో పేస్‌ అనుకూల పిచ్‌పై అనుకున్నట్లే రెండు జట్ల పేసర్లు సత్తా చాటారు. ఇటు భువనేశ్వర్‌ (4/87) స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించగా.. అటు స్టెయిన్‌ (1/13) నేతృత్వంలోని దక్షిణాఫ్రికా పేస్‌ దళం నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టింది.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 286 (73.1 ఓవర్లు) పరుగులకే ముగించిన టీమ్‌ఇండియాకు ఆ ఆనందం అరగంటైనా నిలవలేదు. స్టెయిన్‌, ఫిలాండర్‌ (1/13), మోర్నీ మోర్కెల్‌ (1/0) తమ పేస్‌ ప్రతాపాన్ని రుచిచూపిస్తూ గంటలోనే ముగ్గురిని ఔట్‌ చేశారు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 28/3తో కష్టాల్లో పడింది. చెతేశ్వర్‌ పుజారా (5), రోహిత్‌ (0) క్రీజులో ఉన్నారు. నిలదొక్కుకుంటే ఈ పిచ్‌పై పరుగులు సాధించొచ్చని దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌ (65; 84 బంతుల్లో; 11×4), డుప్లెసిస్‌ (62; 104 బంతుల్లో 12×4) ఇప్పటికే నిరూపించారు.

భువీ.. బూమ్.. బూమ్
ఇన్నింగ్స్‌ మూడో బంతికే వికెట్‌.. మూడో ఓవర్లో మరో వికెట్‌.. ఇంకో ఓవర్‌ గడిచిందో లేదో ఇంకో వికెట్‌.. తర్వాతి బ్యాట్స్‌మన్‌ ప్యాడ్స్‌ కట్టుకుని సిద్ధమయ్యేలోపు.. మైదానంలోని బ్యాట్స్‌మన్‌ అడుగులు పెవిలియన్‌ వైపు పడ్డాయి! టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకుని తప్పు చేశామేమో అని దక్షిణాఫ్రికా చింతించేలా చేశాడు భువనేశ్వర్‌. శుక్రవారం తొలి టెస్టు మొదటి రోజు భువనేశ్వర్‌ దాటికి దక్షిణాఫ్రికా ఒక దశలో 12/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇన్నింగ్స్‌ మూడో బంతికి ఆఫ్‌స్టంప్‌ ఆవల ఊరించే బంతితో ఎల్గర్‌ (0)ను ఔట్‌ చేసిన అతడు.. ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (5)ను పెవిలియన్‌ పంపాడు. ఒకే ఓవర్లో వరుస ఔట్‌ స్వింగర్లతో పరీక్షించిన అతడు ఓవర్‌ ఆఖరి బంతిని పదునైన ఇన్‌స్వింగర్‌తో మార్‌క్రమ్‌ను వికెట్ల ముందు కట్టడి చేశాడు. ఇక ఆ తర్వాతి ఓవర్లో దక్షిణాఫ్రికా ఆపద్భాందవుడు హషీమ్‌ ఆమ్లా (3)ను ఔట్‌ చేశాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల దూసుకెళ్తున్న బంతిని వేటాడి ఆమ్లా ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌కే జట్టులోని నాలుగు, ఐదో నంబర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజుకి వచ్చేశారు. ఆ దశలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ నిలబడటమే కష్టంగా కనిపించింది.

అయినా ఏ మాత్రం తగ్గక..
ఆరంభంలోనే మూడు వికెట్లు పడ్డప్పటికీ దక్షిణాఫ్రికా అతి జాగ్రత్తకు పోకుండా ఎదురుదాడి చేసి వేగంగా పరుగులు రాబట్టింది. ఒకవైపు భువనేశ్వర్‌ వికెట్లు తీస్తుంటే మిగతా బౌలర్లు క్రమశిక్షణ తప్పారు. ఓవర్‌పిచ్‌ బంతులు వేస్తూ.. లైన్‌ తప్పి.. ప్యాడ్‌లపై ఎక్కువగా బంతులు వేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నారు. అరంగేట్ర బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (1/73) పేలవ బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డు శరవేగంగా సాగింది. షమి, పాండ్య కూడా గతి తప్పి బౌలింగ్‌ చేశారు. భారత బౌలర్ల తొందరపాటును బాగానే ఉపయోగించుకున్నారు డివిలియర్స్‌, డుప్లెసిస్‌.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే టెస్టుల్లోని పునరాగమనం చేసిన డివిలియర్స్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించాడు. నాలుగో వికెట్‌కు డుప్లెసిస్‌తో కలిసి అతను 114 పరుగులు జోడించాడు. దీంతో లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా 107/3తో పర్వాలేదనిపించింది. ఐతే విరామం తర్వాత టీమ్‌ఇండియా పేసర్లు మళ్లీ విజృంభించారు. డివిలియర్స్‌ను ఔట్‌ చేసి బుమ్రా నాలుగో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీయగా.. డుప్లెసిస్‌ను హార్దిక్‌ పాండ్య (1/53) ఔట్‌ చేశాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించిన డికాక్‌ (40 బంతుల్లో 43).. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ సాహాకు చిక్కాడు.

ఫిలాండర్‌ (23) వికెట్‌ను షమి (1/47) తీసుకున్నాడు. టీ విరామానికి దక్షిణాఫ్రికా 230/7తో నిలిచింది. టెయిలెండ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేసే బాధ్యతను అశ్విన్‌ (2/21) తీసుకున్నాడు. మోర్కెల్‌ (2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని అతడు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు అతడు తెరదించాడు.

త్వరగా లాగించేశారు:
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ త్వరగానే ముగిసింది.. వికెట్‌ కూడా పడకుండా భారత్‌ రోజును ముగిస్తే బాగుండని భారత అభిమానులు భావిస్తుంటే.. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించారు దక్షిణాఫ్రికా పేసర్లు స్టెయిన్‌, ఫిలాండర్‌. ప్రశాంతంగా కనిపించిన విజయ్‌ (1) మంచి బంతులను వదిలేస్తూ.. ప్రమాదకర బంతులను అడ్డుకుంటూ వికెట్ కాపాడుకున్నాడు.

మరోవైపు ధావన్‌ (16; 13 బంతుల్లో 3×4) కాస్త ఇబ్బంది పడుతున్నా.. ఫోర్లతో స్కోరు బోర్డును కదిలించాడు. ఇలాగే ఓ గంట ఆడితే సరిపోయేది. ఐతే.. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో ఆఫ్‌స్టంప్‌ ఆవల విసిరిన ఓ బంతిని కవర్‌డ్రైవ్‌ ఆడే ప్రయత్నంలో స్లిప్‌లో ఎల్గర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు విజయ్‌. ఆ తర్వాతి ఓవర్లో ధావన్‌ ఔటయ్యాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో అతడికే సులభమైన క్యాచ్‌ ఇచ్చాడు. విరాట్‌ కోహ్లి (5) పదిహేను నిమిషాలు క్రీజులో ఉన్నాడంతే. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులు ఎదుర్కొనే విషయంలో బలహీనతను ప్రదర్శిస్తూ.. మోర్కెల్‌ బంతిని ఆడబోయి వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

అసలు రహానేను కాదని రోహిత్‌ని
జట్టు ఎంపికలో టీమ్‌ఇండియా రెండు ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకుంది. గత రికార్డులను పరిగణనలోకి తీసుకోని వ్యూహ బృందం.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేసింది. విదేశీ పిచ్‌లపై మంచి రికార్డు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడంతో రహానెను పక్కన పెట్టారు. ఇటీవల సొంతగడ్డపై చక్కటి ఫామ్‌ కనబరిచిన రోహిత్‌ను ఎంచుకున్నారు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రా ఎంపిక ఆశ్చర్యపరిచింది. టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న ఉమేశ్‌, శ్రీలంకతో సిరీస్‌తో ఫామ్‌లోకి వచ్చిన ఇషాంత్‌లను కాదని.. అతడికి టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశమిచ్చారు.

పూజారా, రోహిత్‌లపైనే ఆశలు:
టీమ్‌ఇండియా ముందు అతిపెద్ద సవాల్‌. దక్షిణాఫ్రికాకు ఆధిక్యం కోల్పోకూడదంటే ఇంకా 258 పరుగులు చేయాలి భారత్‌. చేతిలో ఉన్న వికెట్లు ఏడే. ఆందోళన కలిగించే విషయమేంటంటే ఇక మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మన్‌ ఇద్దరే. సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడగల పుజారా ఒకవైపు.. వన్డేల్లో మేటి బ్యాట్స్‌మన్‌గా పేరొందినా ఇంకా టెస్టుల్లో నిరూపించుకునే పనిలో ఉన్న రోహిత్‌ మరోవైపు ఉన్నాడు. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న దక్షిణాఫ్రికా పేసర్లు పేస్‌, బౌన్స్‌, స్వింగ్‌తో ఇప్పటికే సత్తా చాటారు. ఇంకా బంతిపై మెరుపు కూడా పోలేదు. రెండో రోజు ఉదయం వారి బౌలింగ్‌ మరింత ప్రమాదకరంగా మారొచ్చు. మరి భారత బ్యాట్స్‌మెన్‌ ఎలా కాచుకుంటారో..! నిలబడితే.. పరుగులు చేయడం కష్టమేం కాదని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ నిరూపించారు. మరి మన బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు నిలుస్తారో చూడాలి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 6, 2018, 10:55 [IST]
Other articles published on Jan 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+