
లండన్: ఇంగ్లాండ్ కంటే టీమిండియాకు మంచి స్పిన్ అటాక్ ఉందని, చెన్నై పరిస్థితులు ఆతిథ్య జట్టుకు ఎంతో అనుకూలంగా ఉంటాయని ఇంగీష్ మాజీ క్రికెటర్ ఓవైస్ షా అభిప్రాయపడ్డాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాపై ఇంగ్లండ్ స్పిన్ విభాగం సత్తా ఏంటో తెలుస్తుందన్నాడు. భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ గెలుస్తుందని ఓవైస్ షా జోస్యం చెప్పాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. లంక నుంచి నేరుగా చెన్నైకి వచ్చిన రూట్‌సేన ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఉంది.
ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనను ఇంగ్లాండ్ 2-0 క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లీష్ స్పిన్నర్లు డోమ్ బెస్, జాక్ లీచ్ ఇద్దరూ 2 టెస్టుల్లో 22 వికెట్లు పడగొట్టారు. ఇక కెప్టెన్ జో రూట్ టెస్ట్ సిరీస్‌లో 426 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 186 ఇన్నింగ్స్ ఉంది. స్పిన్నర్లకు తోడుగా సీనియర్ పేసర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ కూడా రాణించారు. లంక పర్యటనలో స్పిన్, సీమర్ల పనితీరు బాగుందని, ఇది భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చే అంశమని ఓవైస్ షా అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఇంగీష్ మాజీ క్రికెటర్ ఓవైస్ షా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ... 'శ్రీలంక పర్యటనను ఇంగ్లాండ్ 2-0 ముగించడం జట్టు విశ్వాసాన్ని పెంచేదే. నిజాయితీగా చెప్పాలంటే.. స్పిన్నర్లు డోమ్ బెస్, జాక్ లీచ్ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. కానీ శ్రీలంకలో సిరీస్ మావాళ్లు గెలవగలిగారు. స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో స్టువర్ట్ బ్రాడ్ బాగా బౌలింగ్ చేశాడు. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో జిమ్మీ ఆండర్సన్ కూడా ఆకట్టుకున్నాడు' అని తెలిపాడు.
'బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాపై ఇంగ్లండ్ స్పిన్ విభాగం సత్తా ఏంటో తెలుస్తుంది. స్పిన్నర్లకు ఇది ఓ పరీక్ష లాంటిది. చెన్నై పరిస్థితులు ఇంగ్లాండ్ కంటే టీమిండియాకు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లాండ్‌పై స్పిన్ దాడి చేసి కోహ్లీసేన పైచేయి సాధిస్తుంది. టీమిండియా 2-1తో సిరీస్ గెలుస్తుందని అనుకుంటున్నా. రూట్‌సేనకు ఈ సిరీస్ సవాలే. అయితే గత రెండు వారాలలో ఇంగ్లాండ్ మంచి ప్రదర్శన ఇచ్చింది. ఉపఖండంలో ఎలా గెలవాలో ఇంగ్లాండ్ జట్టుకు తెలుసు' అని ఓవైస్ షా చెప్పుకొచ్చాడు.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్, రిజర్వ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ముగ్గురు శనివారం చెపాక్ స్టేడియంలో మొదటి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులోని మిగతా ఆటగాళ్లకు రెండోసారి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌గా తేలింది. ఫిబ్రవరి 2 నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లాండ్ జట్టు శిక్షణ ప్రారంభించనుంది.