
ముంబై: ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. మొదటగా ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు బౌన్సర్లు సంధించిన బుమ్రా అతడికి క్షమాపణ చెప్పాడట. కానీ ఇండియన్ పేస్ గుర్రం క్షమాపణను పట్టించుకోని జిమ్మీ.. బుమ్రా పక్కకు తోసేసి బూతు మాటలు అన్నాడు. ఆపై బ్యాటింగ్ చేస్తున్న బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తమ నోటికి పని చెప్పారు. వికెట్ కీపర్ జొస్ బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు. దీంతో కోహ్లీ వారికీ ధీటుగా బదులిచ్చాడు. మొత్తంగా లార్డ్స్ టెస్ట్ గొడవలతో ముగిసింది.
తాజాగా టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఈ వివాదంపై స్పందించాడు. 'మేము జేమ్స్ అండర్సన్‌ను ఔట్ చేయడానికి ప్రయత్నించాం. ఈ క్రమంలోనే కొన్ని బౌన్సర్లు విసిరాం. లార్డ్స్ టెస్ట్ సమయంలో జరిగిన దానిని ఓవల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బుమ్రాను అనకూడని మాటలు ఏవో అండర్సన్ అన్నాడని నాకు తెలిసింది. ఇంగ్లండ్ ప్లేయర్స్ బుమ్రాను దూషించారు. ఆ పదాలను బహిరంగంగా చెప్పలేము. అందుకే భారత జట్టులోని ప్రతి ఒక్కరూ ఆవేశపడ్డారు. అది ఆటలో చూపించారు' అని శార్ధూల్ ఓ జాతీయ మీడియాకు చెప్పాడు.
జేమ్స్ అండర్సన్, జస్ప్రీత్ బుమ్రాల మధ్య జరిగిన గొడవ కారణంగా.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు ఫాస్ట్ బౌలర్లు షార్ట్-పిచ్ బంతులను వేయాలా వద్దా అనే దానిపై చర్చలు జరిగాయి. తమ కాలంలో ఇలా చేసేవాళ్లం కాదని కొందరు మాజీలు పేర్కొన్నారు. తాజాగా ఈ అంశంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. 'మేము విదేశాలకు వెళ్లినపుడు.. మా టైలెండర్లు కూడా బౌన్సర్‌లను ఎదుర్కొంటారు. ఈ ఏడాది ఆరంభంలో మేము ఆస్ట్రేలియాకు వెళ్లాం. అక్కడ మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ వేసిన బౌన్సర్‌లకు టీ నటరాజన్ ఇబ్బందిపడ్డాడు. అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కూడా ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదని వారికి కూడా తెలుసు. కాబట్టి మేము కూడా ప్రత్యర్థి టైలెండర్లు వచ్చినప్పుడు బౌన్సర్‌లను ఎందుకు వేయకూడదు. మేము ఎవరినీ సంతోషపెట్టడానికి ఆడటం లేదు. గెలవడానికే ఆడుతున్నాం' అని శార్ధూల్ వివరించాడు.
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు బాదిన శార్ధూల్ ఠాకూర్.. ప్రమాదకర జో రూట్‌ని కీలక సమయంలో క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌ని భారత్ వైపు తిప్పాడు. అంతకుముందు ఆస్ట్రేలియా టూర్‌లోనూ శార్ధూల్ ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చాడు. దాంతో టీమ్‌లో ఆపద్భాందవుడిగా ఎదిగిన ఠాకూర్‌ని అభిమానులు ముద్దుగా 'Lord Thakur' అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇదే పేరుతో నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్‌ని క్రియేట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్నారు. దీనిపై కూడా అతడు రియాక్ట్ అయ్యాడు. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.
'సోషల్ మీడియాలో నేను కూడా ఆ పేరుతో పెద్ద ఎత్తున మీమ్స్ చూశాను. వాటిని బాగా ఎంజాయ్ చేశాను. నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకి అది నిదర్శనం. కానీ ఆ లార్డ్ అనే పేరుని నేను పట్టించుకోను. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇదే సోషల్ మీడియాలో నెటిజన్లు ఒకప్పుడు జట్టులో నా స్థానాన్ని ప్రశ్నించడాన్ని నేను చూశా' అని శార్ధూల్ ఠాకూర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 కోసం శార్ధూల్ యూఏఈలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతడు ఆడుతున్నాడు. ఇంగ్లండ్ ఫామ్ ఐపీఎల్ 2021లో కూడా కొనసాగిస్తే.. చెన్నైకి తిరుగుండదు.