సిడ్నీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వరుసగా నాలుగు వన్డేలు గెలిచిన ఆస్ట్రేలియా జట్టు దూకుడు మీద ఉంది. కనీసం అయిదో వన్డేలో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని భారత్ చూస్తోంది. భారత్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... తాము వైట్ వాష్ నుంచి తప్పించుకుంటామని చెప్పాడు.
వైఫల్యాల కారణంగానే తాము సిరీస్ ఓడిపోయామన్నాడు. తదుపరి మ్యాచ్ (ఐదో వన్డే)లో గెలుస్తామని చెప్పాడు. మరోవైపు, ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. 5-0తో భారత్‌ను వైట్ వాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఐదో వన్డే జనవరి 23న సిడ్నీలో జరగనుంది.

పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్, కాన్ బెర్రాలలో జరిగిన నాలుగు వన్డేలలో ఆసిస్ గెలిచింది. తద్వారా 4-0తో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకుంది. సిడ్నీలోని సిడ్నీ క్రికెట్ మైదానంలో ఐదో వన్డే జరగనుంది.
తాము కచ్చితంగా 5-0తో గెలుస్తామని స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. తమ జట్టు బాగా ఆడుతుందని చెప్పాడు. ఆల్ రౌండర్ గ్లెన్ మాక్సువేల్ దూరం అయినా కూడా తాము గెలుస్తామని చెప్పాడు. అలాగే ట్వంటీ 20ని 3-0తో గెలుస్తామన్నాడు. తొలుత తాము 5-0తో వన్డేలు గెలుచుకోవాలన్నాడు. ఆ తర్వాత ట్వంటీ 20ల పైన దృష్టి పెడతామన్నాడు.