తమ దేశ క్రికెట్ ఐసీయూలో ఉందని, చికిత్స అందించడానికి స్పెషలిస్టులు కూడా లేరని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అన్నాడు. పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న నేపథ్యంలో లతీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్‌లో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాడు.
''ఇది నాయకత్వ సంక్షోభం. పాకిస్థాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది. చికిత్స అందించడానికి నిపుణులు ఎవరూ లేరు. అసలు బాబర్ అజామ్ తిరిగి కెప్టెన్సీని తీసుకోవాల్సింది కాదు. జట్టు రాణించలేదు, అతను పెద్దగా పరుగులు చేయలేదు. అయితే కెప్టెన్సీకి రాజీనామా చేసిన నిర్ణయం ఆలస్యమైందని నా అభిప్రాయం. ఈ నిర్ణయం అతనిపై మాత్రమే కాదు, జట్టుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది''అని రషీద్ లతీప్ అన్నాడు.

సారథి బాధ్యతల నుంచి బాబార్ తప్పుకోవడం ఇది రెండో సారి. 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన అనంతరం జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ20లకు బాబర్ అజామ్ స్థానంలో షాహిన్ అఫ్రిదిని కెప్టెన్‌గా నియమించారు. కానీ అఫ్రిదికి కేవలం న్యూజిలాండ్ సిరీస్ వరకే ఛాన్స్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ ముంగిట తిరిగి వైట్ బాల్‌కు బాబార్‌ను తిరిగి కెప్టెన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది.
కానీ ఈ మెగాటోర్నీలో పాక్ ఘోర వైఫల్యాలను చవిచూసింది. అమెరికాతో చేతిలోనూ ఓటమిపాలై కనీసం గ్రూప్ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది. మరోవైపు కెప్టెన్సీ మార్పులపై పాకిస్థాన్ టీమ్‌లో ఐకమత్యం దెబ్బతిందని సమాచారం. ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఒత్తిడి మేరకు బాబర్ అజామ్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడని ప్రచారం కూడా సాగుతోంది. కాగా, బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.
పాకిస్థాన్ తరఫున బాబర్ అజామ్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 123 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 3962 పరుగులు, వన్డేల్లో 5729 పరుగులు, టీ20ల్లో 4145 పరుగులు చేశాడు.