హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్‌మెన్ రాణించడంతో అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో మూడు వన్డేల సిరిస్‌పై కోహ్లీసేన ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
రెండో వన్డే అనంతరం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మీడియాతో మాట్లాడాడు. 'ఈ మధ్య కాలంలో 230 పరుగులు పెద్ద స్కోరే కాదు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మా బౌలర్లు విజృంభించారు. సగం పనిని బౌలర్లు ముందుగానే పూర్తిచేయడంతో సునాయాసంగా విజయం సాధించాం' అని ధావన్ అన్నాడు.

'రెండో వన్డేలో విజయం క్రెడిట్ అంతా కచ్చితంగా బౌలర్లదే. సీమ్‌కు పెద్దగా అనుకూలించని పిచ్‌పై బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి కివీస్‌ను కట్టడి చేశారు. ఇక్కడే సగం పని పూర్తి అయింది. కివీస్ చేసిన 230 పరుగులు ప్రస్తుత రోజుల్లో పెద్ద కష్టం కాదు' అని ధావన్ చెప్పుకొచ్చాడు.
'అంతేకాదు మూడొందల పరుగుల్ని సులువుగా ఛేదించే ఈ రోజుల్లో 230 పరుగులను చేధించడం పెద్ద కష్టం కాదు. న్యూజిలాండ్‌ను కట్టడి చేయడంలో బౌలర్లు రాణించడం ఒకటైతే, ఫీల్డర్డు ఆకట్టుకోవడం రెండోది' అని ధావన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన భువీ (3/45)ని ధావన్ ప్రశంసించాడు.
మూడు వన్డేల సిరిస్‌లో ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి. సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆదివారం (అక్టోబర్ 29)న కాన్పూర్ వేదికగా జరగనుంది. మూడు వన్డేల సిరిస్ అనంతరం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.