
హైదరాబాద్: భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌కు అక్టోబర్ 16(బుధవారం) ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. కపిల్ దేవ్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
1978 అక్టోబర్ 16న పాకిస్థాన్‌పై ఫైసలాబాద్‌లో తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన కపిల్.. ఆ పర్యటనలో బౌలింగ్‌తో ఆకట్టుకోలేకపోయాడు. తన తొలి టెస్టులో కపిల్ బౌలింగ్ స్పెల్స్ 16-2-71-0 & 12-3-25-1 ఇలా ఉన్నాయి. ఆ తర్వాత కపిల్ దేవ్ ఆడిన మూడో టెస్టులోనే భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1983లో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుని తొలిసారి విశ్వవిజేతగా నిలిపాడు. భారత్ తరుపున మొత్తం 131 టెస్టులాడిన కపిల్ దేవ్ 5,248 పరుగులు చేసి, 434 వికెట్లు తీశాడు. 1994లో న్యూజిలాండ్‌పై ఆఖరి టెస్టు ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
భారత క్రికెట్ చూసిన అత్యుత్తమ ఆల్ రౌండర్ కపిల్ దేవ్. ఆ తర్వాత కపిల్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఇంతవరకూ రాలేదు. ప్రపంచ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి కపిల్ దేవ్ 41 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఐసీసీ కపిల్‌కు సంబంధించి "మీ మధురజ్ఞాపకం ఏమిటీ?" అని ఐసీసీ ట్విటర్‌లో అభిమానులను కోరింది.
ఐసీసీ ట్వీట్‌కు ఓ అభిమాని "1983 వరల్డ్‌కప్" అని చెప్పగా... మరొక నెటిజన్ ఆ వరల్డ్‌కప్‌లో "జింబాబ్వేపై కపిల్ సాధించిన 175 పరుగులు" అంటూ ట్వీట్ చేశాడు.