Priyansh Arya: ఐపీఎల్ 2025లో భాగంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య వేగంగా సెంచరీ బాదేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏప్రిల్ 8న జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ యువ బౌలర్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 8 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయినా.. కేవలం 39 బంతుల్లో సెంచరీ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ అనంతరం ప్రియాన్ష్ ఆర్య మాట్లాడుతూ.. ధోనితో మాట్లాడాలని అనుకున్నప్పటికీ తనకు ఆ ఛాన్స్ దొరకలేదని.. అదొక్కటే తనను బాధిస్తోందని చెప్పాడు.
ధోని లాంటి ఆటగాళ్లతో ఆడే గొప్ప అవకాశం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుందని ప్రియాన్ష్ పేర్కొన్నాడు. ధోనితో ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. వికెట్ల వెనుక ధోని ఉన్నప్పుడు ఒత్తిడే సహజమేనని.. అశ్విన్ లాంటి లెజండరీ బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు కూడా ఒత్తిడి ఉంటుందన్నాడు. అలాంటి సమయంలో శతకం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. మ్యాచ్ తర్వాత ధోనితో మాట్లాడలనుకున్నానని.. కానీ ఇంటర్వ్యూ ముగించుకునేసరికి ఆయన వెళ్లిపోయారని.. ధోనితో మాట్లాడలేకపోయానని ప్రియాన్ష్ ఆర్య చెప్పుకొచ్చాడు.

పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కూడా ప్రియాన్ష్ ఆర్య మాట్లాడాడు. సీఎస్కేతో మ్యాచ్ కంటే ముందు రాజస్థాన్ తో తొలి బంతికే ఔటయ్యానని .. దానికి చాలా బాధ పడ్డానంటూ ప్రియాన్ష్ ఆర్య చెప్పుకొచ్చాడు. కానీ కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కసారి కూడా విమర్శించలేదన్నాడు. బ్యాటింగ్ ఎలా మెరుగుపరచుకోవాలో చెప్పి తనలో స్ఫూర్తినింపారని ప్రియాన్ష్ ఆర్య స్పష్టం చేశాడు.