
తిరువనంతపురం: ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్ వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టాలీవుడ్ హీరోయిన తమన్నా భాటియాకు గట్టి షాక్ తగిలింది. వీరితోపాటు మాలీవుడ్ నటుడు అజు వర్గీస్‌కు కేరళ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్న వీరిని దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా బుధవారం నోటీసులు జారీ చేసింది.
త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్ అనే వ్యక్తి ఈ గేమ్స్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు కోహ్లీ, తమన్నా, అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇక ఈ వివాదంలో పలువురు నటులుతో పాటు క్రికెట్ సెలబ్రిటీలపై ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌గా స్పందించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, హీరోయిన్ తమన్నా, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లకు గతేడాది మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను సూటిగా ప్రశ్నించింది. అంతేకాకుండా వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా మందలించింది.