
వామికపై అసభ్యకర కామెంట్లు:
టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో పాకిస్తాన్ చేతిలో కూడా కోహ్లీసేన ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో టీమిండియా రెండు వరుస పరాభవాలు ఎదుర్కొంది. బ్యాటర్లు, బౌలర్లు తేలిపోవడంతో భారత జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా చాలా మంది దాడులు చేస్తున్నారు. పాకిస్థాన్ చేతిలో పరాజయం తర్వాత పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు.. కివీస్ చేతిలో ఓడిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్క శర్మ, 9 నెలల కుమార్తె వామికపై కూడా అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.
మహిళా కమిషన్ సీరియస్:
విరాట్ కోహ్లీ కూతురు వామిక ఫొటోలను విడుదల చేయాలని, అవి బయటపడిన తర్వాత పాపపై అత్యాచారం చేస్తామని బెదిరింపులకు దిగారు కొంతమంది నెటిజన్లు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయింది. ఈ బెదిరింపులను సుమోటోగా తీసుకుంది. ఈ బెదిరింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ, గుర్తించిన నిందితులు, వారిలో అరెస్టయిన వారి వివరాలు అందించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలను వివరిస్తూ నవంబరు 8లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

పశుతత్వాన్ని చాటుతోందంటూ:
భారత జట్టు పేలవ ప్రదర్శనకు గాను గతంలో అనుష్క శర్మను నెటిజన్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. 20219 వన్డే ప్రపంచకప్ సమయంలో అనుష్కను ఆటాడుకున్నారు. అయితే ఇప్పుడు హద్దులూ దాటుతూ అభంశుభం తెలియని చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వారిలోని పశుతత్వాన్ని చాటుతోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి బెదిరింపులను అరికట్టేలా కఠిన చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైన సందర్భంలో ఎంఎస్ ధోనీ కూతురు జీవాకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన విషయం తెలిసిందే.

నాకౌట్‌కు అర్హత సాధించాలంటే:
సూపర్-12లో భాగంగా గ్రూప్-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్ పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. కివీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్, నమీబియాలపై గెలిస్తే సెమీస్ చేరనుంది. ఇక భారత్ నాకౌట్‌కు అర్హత సాధించాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా జరగని పనే అని చెప్పాలి. బుధవారం అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.


Click it and Unblock the Notifications












