
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు దక్షిణాఫ్రికా జట్టులో కరోనా వైరస్ కలకలం రేపింది. ప్రొటీస్ జట్టులోని ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడిని కేప్‌టౌన్‌లోని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అలాగే అతడిని కలిసిన మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే ఈ ముగ్గురికీ ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) తాజాగా వెల్లడించింది.
అయితే వైరస్ సోకిన ఆటగాడు, అతడిని కలిసిన మరో ఇద్దరు ప్లేయర్ల పేర్లు మాత్రం సీఎస్‌ఏ బయటపెట్టలేదు. కొవిడ్-19 ప్రోటోకాల్స్‌లో భాగంగా ముగ్గురు ఆటగాళ్లను కేప్‌టౌన్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారు. దక్షిణాఫ్రికా జట్టులోని ఇతర ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తుందని సీఎస్‌ఏ అధికారిక ప్రకటనలో తెలిపింది.
'ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడిని కలిసిన మరో ఇద్దరినీ ఐసోలేషన్‌కు తరలించాం. మా వైద్య సిబ్బంది నిరంతరం వారిని పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురికీ ఎలాంటి వైరస్ లక్షణాలూ లేవు. ప్రస్తుతానికి వీళ్లని జట్టు నుంచి తప్పించలేదు. అయితే మరో ఇద్దరు ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేరుస్తున్నాం. నవంబర్ 21 నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో వాళ్లు పాల్గొంటారు' అని దక్షిణాఫ్రికా బోర్దు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లండ్‌తో రాబోయే పరిమిత ఓవర్ల పర్యటన కోసం కేప్‌టౌన్‌లో బయో సేఫ్ వాతావరణంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సుమారు 50 కొవిడ్-19 పీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు సీఎస్‌ఏ తెలిపింది. ఈ నెల 21న ఇంగ్లండ్ జట్టు ఇంటర్ స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. రెండు జట్ల మధ్య మూడు టీ20, మరో మూడు వడ్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. నవంబర్ 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.