మొహాలి: ఇంగ్లాండ్ జట్టుకు కోహ్లీ భయం పట్టుకుంది. మొహాలిలో జరగనున్న మూడో టెస్టులో కోహ్లీ దూకుడుకు కళ్లెం వేయడానికి సిద్ధమైంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రా ముగియగా, విశాఖలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో ఐదు టెస్టుల సిరిస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. విశాఖ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కోహ్లీ నమోదు చేసిన 248 పరుగులే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహాం లేదు.
వీటిలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి. ఇక టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (52 పరుగులు, 8/119) సైతం అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని త్వరగా ఔట్ చేసేందుకు గాను ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అన్నాడు.
శనివారం నుంచి మొహాలిలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడో టెస్టులో విజయం సాధించి, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-1తో సమం చేయాలనేది ఇంగ్లాండ్ లక్ష్యమని గురువారం మీడియాతో మాట్లాడిన వోక్స్ తెలిపాడు.

మూడో టెస్టులో కోహ్లీని త్వరగా పెవిలియన్‌కు చేర్చితే, తమ విజయావకాశాలు మెరుగవుతాయని వోక్స్ చెప్పాడు. కోహ్లీ, పుజారా చక్కటి రాణిస్తున్నారని, భారీగా పరుగులు సాధిస్తున్నారని వోక్స్ ప్రశంసించాడు. మూడో టెస్టులో వీరిద్దరిని కట్టడి చేసేందుకు గాను ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని చెప్పాడు.
మూడో టెస్టులో తమ ప్రధాన లక్ష్యం మాత్రం కోహ్లీనే అని పేర్కొన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రెండో టెస్టులో ఓడినా తమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. మొహాలి టెస్టులో తన సహచర బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ లేకపోవడం తీరని నష్టమని అభిప్రాయ పడ్డాడు.
అతడు ప్రపంచ స్థాయి బౌలరని, సుదీర్ఘ కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడని వోక్స్ అన్నాడు. ఇక మూడో టెస్టుకు స్టువర్ట్ బ్రాడ్ అందుబాటులో లేకపోవడం సమస్యగా పేర్కొన్నాడు. అయితే, ఆ సమస్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌కు గట్టి పోటీఇస్తామని వోక్స్ తెలిపాడు.