హైదరాబాద్: టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌కి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల సినీనటి సాగరికతో నిశ్చితార్థం చేసుకున్న జహీర్ ఖాన్ శనివారం తన 39వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు.
ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తనదైలిలో శుభాకాంక్షళు చెప్పి నవ్వులు పూయించాడు. 'భారత్ తరఫున తెలివైన, గొప్ప బౌలర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. జహీర్ నీకిదే చివరి బ్యాచిలర్ బర్త్ డే' అంటూ సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. అక్టోబరు 3, 2000లో కెన్యా జట్టుపై జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.
అతి తక్కువ కాలంలో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. లైన్, పేస్ బౌలింగ్‌తో మ్యాచ్ ఆరంభంలోనే ప్రత్యర్థి ఓపెనర్లని హడలెత్తించాడు. జట్టులోని సహచర బౌలర్లకి సైతం సూచనలిస్తూ మార్గదర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్ ఖాన్ 200 వన్డేలాడిన జహీర్ 282 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. 2003, 2007, 2011 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా జహీర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
భారత్ తరుపున 92 టెస్టులాడిన జహీర్ ఖాన్ 311 వికెట్లు తీశాడు. ఇక భారత తరుపున 17 టీ20 మ్యాచ్ లాడాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు.