హైదరాబాద్: బుధవారం టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ 43వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం లక్ష్మణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరిలోకెల్లా లక్ష్మణ్‌కి విషెస్ చెబుతూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సచిన్ తన ట్వీట్‌లో లక్ష్మణ్‌కి సంబంధించిన ఓ డ్రెస్సింగ్ రూమ్ రహస్యాన్ని బయటపెట్టాడు. 'హ్యాపీ బర్త్‌డే లక్ష్మణ్. మైదానంలో నువ్వు పరుగులు సాధించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో బయటికి చెప్పేయనా? బ్యాటింగ్‌కు వెళ్లేముందు నువ్వు స్నానం చేసి యాపిల్ తింటావు' అని సచిన్ ట్వీట్ చేశాడు.
లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'రిస్ట్ జాదుగర్, భారత శ్రీ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన మణికట్టు మాయతో అనుగుణంగా మార్చేస్తాడు. చిటియాన్ కలైయాన్' అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన లక్ష్మణ్ అనతి కాలంలోనే భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలనందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 11వేలకు పైగా పరుగులు సాధించిన లక్ష్మణ్ అందులో 3,173 పరుగులు ఆస్ట్రేలియాపైనే సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2012లో ఆడిలైట్‌లో జరిగిన టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.