సరిగ్గా నలభై ఏళ్ల క్రితం. ఎవరూ ఊహించని ఒక్క విజయం.. ప్రపంచ క్రికెట్ గతిని మార్చేసింది. అదే 1983 వరల్డ్ కప్ ఫైనల్. ఆ టోర్నీలో అండర్ డాగ్‌గా బరిలో దిగిన భారత జట్టు.. ఎవరూ ఊహించని విధంగా ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు సైతం ఫైనల్ చేరడంలో విఫలమవగా.. భయంకరమైన విండీస్‌తో తలపడేందుకు పసికూనగా పేరు పడిన భారత్ రెడీ అయింది.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ ఏమాత్రం రాణించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టులో ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మాత్రమే రాణించారు. మిగతా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కు కూడా దాటలేదు. దీంతో నిర్ణీత 60 ఓవర్లలో భారత జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ స్కోరు చూసిన వాళ్లంతా విండీస్ విజయం ఖాయమని అనుకున్నారు.

అయితే భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా బ్యాటుతో ఫర్వాలేదనిపించిన మొహిందర్ అమర్‌నాథ్ కేవలం 12 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అతనితోపాటు మదన్ లాల్ కూడా 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో విండీస్ ఒత్తిడిలో పడింది. ఆ జట్టులో లెజెండరీ బ్యాటర్ వివ్ రిచర్డ్స్ (33), జెఫ్ డూయోన్ (25) రాణించారు.
విండీస్‌ను గెలిపించేలా కనిపించిన రిచర్డ్స్‌ను కపిల్ దేవ్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ ఆశలు గల్లంతయ్యాయి. భారత బౌలర్లలో మదన్ లాల్, అమర్‌నాథ్‌తోపాటు బల్వీందర్ సంధూ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. రోజర్ బిన్నీ, కపిల్ దేవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో వెస్టిండీస్ కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
క్రికెట్‌లో భారత్ అందుకున్న తొలి వరల్డ్ కప్ ఇదే. ఈ విజయంతో అప్పట్లో అతిపెద్ద క్రికెట్ టీంగా ఉన్న వెస్టిండీస్ పతనం కూడా మొదలైంది. అంతకుముందు వరుసగా రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ఈ టీం.. భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడలేదు. ఈ ఫైనల్ తర్వాత ప్రపంచ క్రికెట్ గతి మారిపోయిందని, భారత జట్టు ఒక పవర్ హౌస్‌గా ఎదిగిందని అప్పటి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ చెప్పాడు.