సరిగ్గా ఇదే రోజు.. గంగూలీ అరుదైన రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్!!

హైదరాబాద్: ఇంగ్లండ్ వేదికగా 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. విభిన్న పిచ్‌లు, భిన్న పరిస్థితుల్లో ఒకే తరహా ప్రదర్శనతో టోర్నీ ఆసాంతం ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో 2019 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు ఐదు శతకాలతో చెలరేగాడు. దీంతో రోహిత్ ప్రపంచకప్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఆ రికార్డు నెలకొల్పి నేటికి ఏడాది:
భారత్ తరఫున మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2003లో మూడు సెంచరీలు చేసాడు. ఆ తర్వాత భారత్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదింది రోహిత్ శర్మనే. ఆ రికార్డు నెలకొల్పి నేటికి ఏడాది పూర్తయింది. 2019 జులై 2న భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు సహరించే పిచ్‌పై 314 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7x4, 5x6) సెంచరీ చేసాడు.

గంగూలీ సరసన:
బంగ్లాదేశ్ మ్యాచ్ కన్నా ముందే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆతిథ్య ఇంగ్లండ్‌పై శతకంతో చెలరేగాడు. దాంతో 16 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా గంగూలీ సరసన చేరాడు. దాదా 2003 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాలో మూడు శతకాలు సాధించాడు. మరోవైపు రోహిత్ బంగ్లాదేశ్ జట్టుపై సెంచరీ చేయడంతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రికార్డును సమం చేశాడు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్‌లో లంక మాజీ బ్యాట్స్‌మన్ నాలుగు శతకాలతో చెలరేగిపోయి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

2 ప్రపంచకప్‌లలో ఆరో సెంచరీ:
ఇక శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇది వరకు ఒకే ప్రపంచకప్‌లో నాలుగు సెంచరీలతో సంగక్కర పేరిట ఉన్న రికార్డును రోహిత్ చెరిపేశాడు.ప్రపంచకప్‌లలో మొత్తం ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డుకు కూడా చేరువయ్యాడు. సచిన్ తన కెరీర్ ఆసాంతం ఆడిన అన్ని ప్రపంచకప్‌లలో కలిపి ఆరు సెంచరీలు చేయగా.. రెండో ప్రపంచకప్‌లు మాత్రమే ఆడిన రోహిత్ ఆరో సెంచరీని చేశాడు.

గోల్డెన్ బ్యాట్:
ప్రపంచకప్-2019లో ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్‌ను అందుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ గోల్డెన్ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. 9 మ్యాచ్‌లలో ఐదు శతకాలు సాధించిన రోహిత్.. 81 సగటుతో 648 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (647) రెండో స్థానంలో, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ (606) మూడో స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (576), ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ (556) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications