Rohit Sharma ప్రపంచ రికార్డుకు 2 ఏళ్లు పూర్తి.. వరల్డ్ క్రికెట్లో అది హిట్‌మ్యాన్‌కే సొంతం!!

హైదరాబాద్: టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్నాడు. మూడు ఫార్మాట్‌లలోనూ సత్తాచాటుతున్నాడు. రోహిత్ ఒక్కసారి క్రీజులో నిలదొక్కున్నాడంటే.. పరుగుల వరద పారాల్సిందే. ఫోర్లు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తుంటాడు.
మంచినీళ్ల ప్రాయంగా సెంచరీ, డబుల్ సెంచరీలు చేసే రోహిత్.. ఒక వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఐదు సెంచరీలు చేశాడు. రోహిత్ ఆ ఘనత సాధించి నేటికి (జులై 6) సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి.

ఐదు సెంచరీలు
2019 వన్డే ప్రపంచకప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. 8 ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుసార్లు మూడంకెల కన్నా ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం. గతంలో ఏ ఇతర క్రికెటర్‌కూ సాధ్యం కాని రికార్డు ఇది. అంతకుముందు 2015 ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 4 సెంచరీలతో క్రియేట్ చేసిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాపై 122 నాటౌట్, మాంచెస్టర్‌లో పాక్‌పై 140, బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై 102, బర్మింగ్‌హామ్‌లో బంగ్లాదేశ్‌పై 104, లీడ్స్‌లో శ్రీలంకపై 103 పరుగులు చేశాడు. లీగ్ స్టేజ్‌లోనే రోహిత్ ఈ ఘనత అందుకున్నాడు.

అత్యధిక పరుగులు
2019 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లలో ఐదు శతకాలు సాధించిన రోహిత్ శర్మ 81 సగటుతో 648 పరుగులు సాధించాడు. మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రోహిత్.. గోల్డెన్ బ్యాట్‌ను దక్కించుకున్నాడు. దీంతో గోల్డెన్ బ్యాట్‌ను అందుకున్న భారత మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ కంటే ముందు భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (1996, 2003), రాహుల్ ద్రావిడ్ (1999) గోల్డెన్ బ్యాట్‌ను అందుకున్నారు. ఇక ప్రపంచకప్‌లలో ఆరు సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా సచిన్ సరసన హిట్‌మ్యాన్ చేరాడు.
38 ఏళ్ల వయసులోనూ అదరగొడుతూ.. 1000వ వికెట్ తీసిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్!!

సచిన్ తర్వాత
2019 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ (673) తర్వాత మెగా టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా అవతరించాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ ఏకంగా 673 పరుగులు సాధించాడు. 2019లో హిట్‌మ్యాన్ 648 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ జాబితాలో మాథ్యూ హెడేన్ (2007 ప్రపంచకప్‌లో 659) రెండో స్థానంలో నిలిచాడు.

సెమీస్‌లో 1 పరుగే
ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. సెమీస్‌లో భారత్ చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచింది. ఇన్ని సెంచరీలు చేసిన రోహిత్ శర్మ కీలకమైన సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 1 పరుగే చేయడంతో అభిమానుల గుండె పగిలింది. ప్రస్తుతం రోహిత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications