
విలియమ్సన్, టేలర్ హాఫ్ సెంచరీలు:
మాంచెస్టర్ వేదికగా 2019 జులై 9న ప్రారంభమైన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డే (జులై 10)కి వెళ్లింది. ఆ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుణుడు అడ్డంకిగా మారడంతోన్యూజిలాండ్ తొలి రోజు 46.1 ఓవర్లలో 211/5తో నిలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను మరుసటి రోజుకు వాయిదా వేశారు. దీంతో తర్వాతి రోజు కివీస్ మిగిలిన ఓవర్లు పూర్తి చేసి 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. కేన్ విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయగా.. ఇతర భారత బౌలర్లు తలా ఒక వికెట్ పడగొట్టారు.

టాప్ ఆర్డర్ టపటపా:
లక్ష్య ఛేదనలో భారత్ ఆదిలోనే తడబడింది. అప్పటివరకు వరుస సెంచరీలతో అదరగొట్టిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. కేఎల్ రాహుల్ (1), విరాట్ కోహ్లీ (1), దినేష్ కార్తీక్ (6) వెంటవెంటనే ఔట్ అయ్యారు. హెన్రి,బౌల్ట్ దెబ్బకు భారత్ 24 రన్స్‌కే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇండియన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కుప్పకూలగా.. మైదానంలోని ప్రేక్షకుల ముఖాల్లో నిరాశ నెలకొంది. రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (32) కాసేపు పోరాడి ఔట్ అయ్యారు. ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6), రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6) ఆచితూచి ఆడుతూ అర్ధ శతకాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రపంచకప్ చరిత్రలో ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

మార్టిన్ గప్తిల్ డైరెక్ట్ త్రో:
జడేజా. ధోనీ సూపర్ ఇన్నింగ్స్‌తో విజయంపై ఆశలు రేకెత్తించారు. ఇక భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా.. విలియమ్సన్ చేతికి చిక్కాడు. అయినా ధోనీ ఉన్నాడనే భరోసా అభిమానుల్లో ఉంది. భారత్ విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు కావాలి. ఈ దశలో ధోనీ, భువనేశ్వర్ క్రీజులో ఉన్నారు. ఫెర్గుసన్ వేసిన 49 ఓవర్ మొదటి బంతిని ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతిని షాట్ ఆడిన ధోనీ.. రెండో పరుగుకు యత్నించగా కివీస్ ఫీల్డర్ మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో బెయిల్స్‌కు తాకడంతో ధోనీ పెవిలియన్ చేరాడు. దీంతో కోట్లాది మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మైదానమంతా మూగబోయింది. చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది.

ధోనీ కన్నీళ్లు:
మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు, డ్రెస్సింగ్ రూంలో రోహిత్ శర్మ భావోద్వేగం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అదే చివరి మ్యాచ్ అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ మ్యాచ్ జరిగిన ఏడాదికి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.


Click it and Unblock the Notifications












