3 బంతుల్లో 2 పరుగులు.. ధోనీ చాకచక్యం! ఊపిరిపీల్చుకున్న భారత్! (వీడియో)

హైదరాబాద్: బంగ్లాదేశ్.. పేరుకు చిన్న జట్టే అయినా అప్పుడప్పుడు పెను సంచలనాలు సృష్టిస్తుంది. కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఉన్న బంగ్లా.. తనదైన రోజున పటిష్ట జట్టునైనా ఓడించగలదు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లకు సైతం ఊహించని షాకులు ఇచ్చింది. అన్ని జట్ల కంటే టీమిండియాకు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది బంగ్లా. 2007 వన్డే ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్ మ్యాచులో టీమిండియాను ఓడించి పెద్ద షాక్ ఇచ్చింది. సరిగ్గా ఐదేళ్ల క్రితం కూడా 2016 టీ20 పంచకప్‌లో బంగ్లా మరోసారి భారత్‌కు షాకిచ్చేలా కనిపించింది. కానీ అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాకచక్యంగా వ్యవహరించడంతో ఓటమి తప్పింది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

ముస్తాఫిజుర్, హుస్సేన్ ధాటికి:
2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా గ్రూప్- బిలో భాగంగా బంగ్లాదేశ్-భారత్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌కు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అప్పటికే మంచి బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత్ చిన్నస్వామి లాంటి చిన్న స్టేడియంలో పరుగుల వరద పారిస్తుందనుకున్నారు. కానీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన అంచనాలను అందుకోలేదు. బంగ్లా బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మన్ పరుగులు చేయలేకపోయారు. ముస్తాఫిజుర్, హుస్సేన్, ముహ్మదుల్లా చెలరేగారు.

రైనా టాప్ స్కోరర్:
తొలి వికెట్‌కు రోహిత్ శర్మ (18), శిఖర్ ధావన్ (23).. 42 పరుగులు జోడించి శుభారంభం చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (24), సురేష్ రైనా (30), హార్దిక్ పాండ్యా (15), ఎంఎస్ ధోనీ (13), యువరాజ్ సింగ్ (3) విఫలమయ్యారు. రైనా తప్ప ఎవరూ పెద్ద స్కోర్లు సాధించలేకపోయారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ముస్తాఫిజుర్, హుస్సేన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ స్కోరు చూశాక భారత అభిమానులకు మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి.

3 బంతుల్లో 2:
స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆడుతూ పాడుతూ పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు రన్‌రేట్‌ను కొనసాగిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. తమిమ్ ఇక్బాల్ (35; 32 బంతుల్లో 5x4), షకిబ్ అల్ హసన్ (22; 15 బంతుల్లో 2x6), షబ్బిర్ రహ్మాన్ (26; 15 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. అయితే బంగ్లా విజయానికి చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన వేళ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అప్పటికే ధాటిగా ఆడుతున్న రహీమ్ (11), మహ్మదుల్లా (18) క్రీజులో ఉన్నారు. పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో తొలి మూడు బంతులకు 9 పరుగులు చేశారు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులుగా మారింది.
మహీ పరుగెత్తుకుంటూ వచ్చి:
ఇక్కడే ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ మార్చి తన ప్రత్యేకత చాటాడు. 19.4 బంతికి రహీమ్ ఆడిన షాట్‌ను ధావన్ క్యాచ్ అందుకోగా.. తర్వాతి బంతికే మహ్మదుల్లా క్యాచ్‌ను జడేజా ఒడిసిపట్టాడు. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరమైన వేళ ధోనీ ముస్తాఫిజుర్ (0)ను రనౌట్ చేయడంతో బంగ్లా స్కోర్ 145/9గా నమోదైంది. భారత్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. బంతి చేతిలో ఉన్నా వికెట్లను విసరకుండా.. పరుగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు మహీ. ఇదే మ్యాచుకు హైలేట్. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచినంత పనిచేసి ధోనీసేనకు చెమటలు పట్టించింది. ఈ మ్యాచ్ జరిగి నేటికి ఐదేళ్లు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications