ఆండ్రు ఫ్లింటాఫ్ చేసినదానికి.. చొక్కా విప్పి బదులు తీర్చుకున్న సౌరవ్ గంగూలీ!!

హైదరాబాద్: క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం అది. ఒకవైపు వరుసగా తొమ్మిది ఫైనళ్లలో ఓడిన జట్టు.. మరోవైపు భీకర పేసర్లు, వైవిధ్యమైన వాతావరణంలో లక్ష్య ఛేదన. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది భారత జట్టు. నాట్‌వెస్ట్ సిరీస్ 2002 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. ఉత్కంఠ పోరులో భారీ ఛేదనకు దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమైన ఓ దశలో ఓటమి అంచుల్లో చిక్కుకుంది. అయితే యువ ఆటగాళ్లు మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. టీమిండియా ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందుకుంది. మ్యాచ్ గెలవడం ఒకెత్తయితే.. నాటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ మైదానం బాల్కనీలో భారత జెర్సీ విప్పి సంబరాలు చేసుకోవడం మరోఎత్తు. అది జరిగిన 19 ఏళ్లు గడిచినా.. అభిమానుల మనసుల్లో ఇంకా తాజాగానే ఉంది ఆ ఘటన.

బదులు తీర్చుకున్న దాదా:
ముంబైలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రు ఫ్లింటాఫ్ చేసినదానికి (జెర్సీ విప్పి సంబరాలు) సౌరవ్ గంగూలీ బదులిచ్చాడు. లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పేసి గిరగిరా తిప్పుతూ సంబరాలు చేశాడు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తే.. ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒకానొక సందర్భంలో ఇదే విషయాన్ని దాదాను జెఫ్రీ బాయ్‌కాట్ అడిగాడు. 'బాయ్.. లార్డ్స్ అంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మక్కాలాంటిది కదా! చొక్కా విప్పొచ్చా? అని బాయ్‌కాట్ అడగ్గా.. వాంఖడే మాకూ లార్డ్స్ లాంటిదే. ఫ్లింటాఫ్ అలా చేయొచ్చా' అని గంగూలీ సమాధానం ఇచ్చాడట. దాంతో బాయ్‌కాట్ మరోమాట మాట్లాడలేదట. ప్రస్తుతం నాట్‌వెస్ట్ ఫైనల్ మధురస్మృతులను అభిమానులు సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు.

హుస్సేన్, ట్రెస్కోథిక్ సెంచరీలు:
2002లో లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో మొదట ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ నిక్ నైట్ (14) త్వరగానే ఔటయ్యాడు. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన నాసర్ హుస్సేన్ (115; 128 బంతుల్లో 10×4), మరో ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ (109; 100 బంతుల్లో 7×4, 2×6) సెంచరీలు చేశారు. వారికి తోడుగా ఆండ్రూ ఫ్లింటాఫ్ (40; 32 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అప్పట్లో ఇది భారీ స్కోర్ అనే చెప్పాలి. ఆ కాలంలో 250-270 పరుగులు చేస్తేనే విజయంపై నమ్మకంగా ఉండేవారు. ఇక 300పైగా స్కోర్ చేశారంటే విజయం ఖాయం అనుకునేవారు. ఇంగ్లండ్ కూడా అలానే అనుకుంది.

గంగూలీ, సెహ్వాగ్ చెలరేగినా:
326 పరుగుల లక్యంతో దిగిన భారత్ ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్లు సౌరవ్ గంగూలీ (60; 43 బంతుల్లో 10×4, 1×6), వీరేంద్ర సెహ్వాగ్ (45; 48 బంతుల్లో 7×4) చెలరేగి ఆడారు. దాంతో 15 ఓవర్లలోపే భారత్ 106 పరుగులు చేసింది. కానీ ఇంగ్లీష్ బౌలర్లు పుంజుకొని 24 ఓవర్లకే 146 పరుగులకు 5 వికెట్లు పడగొట్టారు. రాహుల్ ద్రవిడ్ (5), సచిన్ టెండూల్కర్ (14), దినేశ్ మోంగియా (9) విఫలమయ్యారు. దాంతో భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ.

ఆదుకున్న యువీ, కైఫ్:
ఆ సమయంలో కుర్రాళ్లైన యువరాజ్ సింగ్ (69; 63 బంతుల్లో 9×4, 2×6), మహ్మద్ కైఫ్ (87; 75 బంతుల్లో 6×4, 2×6) అద్భుతం చేశారు. ఈ జోడి ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యువీ పెవిలియన్ చేరాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివరకు భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్‌ను టీమిండియాకు అందించాడు. చివరివరకూ క్రీజులో ఉండి జహీర్ ఖాన్ కూడా అద్భుతంగా ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications