
భారత యుద్ధ విజయాల్లో అత్యంత ప్రాధాన్యమైన వాటిలో కార్గిల్ యుద్ధం ఒకటి. 1999లో భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాకిస్థాన్ ఆర్మీ పన్నిన పన్నాగాన్ని భారత్ సైన్యం సమర్థంగా తప్పికొట్టింది. 'ఆపరేషన్ విజయ్' పేరుతో మళ్లీ భారత్ జోలికి రావొద్దనే గుణపాఠం చెప్పింది. పాకిస్తాన్ సైన్యం స్వాధీనం చేసుకున్న అన్ని ప్రాంతాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈక్రమంలో ఎంతో మంది సోల్జర్స్ తమ ప్రాణాలర్పించారు.
ఇకపోతే కార్గిల్ యుద్ధం మే 3నుంచి జులై 26వరకు జరిగింది. జులై 26న భారత్ విజయం సాధించడంతో ఏటా ఈ రోజును కార్గిల్ విజయ్ దివాస్‌గా యావత్ భారతదేశం జరుపుకుంటుందనే సంగతి తెలిసిందే. ఈరోజు భారత విజయం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికులను స్మరించుకుంటాం. ఈ క్రమంలో భారత ప్రముఖ క్రికెటర్లు సైతం సైనికులకు నివాళులర్పిస్తూ ట్విట్టరులో పోస్టులు చేశారు.
మిథాలీ రాజ్ స్పందిస్తూ.. 'కార్గిల్‌లో మన దేశం కోసం ధైర్యంగా పోరాడిన వారందరికీ నా వందనం. వారి ధైర్యం, త్యాగం ఎప్పటికీ మరువలేనిది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ బ్రేవ్ సోల్జర్స్‌ను స్మరించుకుందాం' అని పోస్టు చేసింది. ఇక 'మన దేశ గౌరవం, సమగ్రతను నిలబెట్టినందుకు మన సాయుధ దళాలకు నేను వందనం చేస్తున్నాను. మన మాతృభూమిని రక్షించే ప్రతి సైనికుడికి కార్గిల్ దివాస్ సందర్భంగా నా డీపెస్ట్ రెస్పెక్ట్.' అని రిషబ్ పంత్ ట్వీట్ చేశాడు.
మన మాతృభూమిని కాపాడుకోవడంలో తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులయిన వీర సైనికులకు నా నివాళులు. వారు మన దేశానికి చేసిన సేవలకు, అలాగే మన రక్షణ దళాలలోని ప్రతి ఒక్క సైనికుడికి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాము.. జైహింద్' అని మాజీ క్రికెటర్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. వీరే కాకుండా కేఎల్ రాహుల్, రాబిన్ ఉతప్ప, గౌతం గంభీర్ తదితర క్రికెటర్లు సైతం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నివాళులు ప్రకటించారు.