
హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లు మరోసారి వార్తల్లో నిలిచారు. బీసీసీఐ అంబుడ్స్‌మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ సారథ్యంలోని కమిటీ టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
'కాఫీ విత్ కరణ్' టీవీ షోలో పాల్గొన్న కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన బీసీసీఐ కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. రెండు వారాల వ్యవధిలోనే ఆ నిషేధాన్ని ఎత్తివేసిన కమిటీ.. బీసీసీఐ అంబుడ్స్‌మన్ నియామకం తర్వాత విచారణ చేపట్టాలని నిర్ణయించింది.
అయితే ఇటీవల సుప్రీంకోర్టు.. బీసీసీఐ అంబుడ్స్‌మన్‌గా డీకే జైన్‌ని నియమించింది. తాజాగా జైన్ సారథ్యంలోని కమిటీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న హార్దిక్ పాండ్యాలకు అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
వీటిపై స్పందించిన హార్దిక్, రాహుల్‌లు తమ బిజీ షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా హాజరుకాలేమని సమయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, రాహుల్‌లు ఐపీఎల్‌లో పలు మ్యాచ్‌లు గైర్హాజరీ అయ్యే అవకాశం ఉండటంతో వారు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చిస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ విషయంపై జస్టిస్ జైన్ మాట్లాడుతూ "హార్దిక్.. రాహుల్‌లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం. విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం. సహజ న్యాయం ప్రకారం. వారి వాదనను వినాల్సి ఉంది. విచారణకు హాజరై వారి వాదనను వినిపించాల్సిన బాధ్యత వారిదే. ఎప్పుడు వస్తారో చూడాలి" అని తెలిపారు.