
హైదరాబాద్: లిస్ట్-ఎ క్రికెట్‌లో మరో చెత్త రికార్డు నమోదైంది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య ఒమన్ జట్టు 17.1 ఓవర్లలోనే 24 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో నమోదైన స్కోరు లిస్ట్-ఎ క్రికెట్‌లో నాలుగో అత్యల్ప స్కోరుగా రికార్డు అయింది.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు రికార్దు వెస్టిండీస్ పేరిట ఉంది. 2007లో బార్బోడాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అండర్-19 జట్టు 18 పరుగులకే ఆలౌటైంది. ఇదే ఇప్పటికీ లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు. ఆ తర్వాత 2012లో కోల్ట్ సీసీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సరాసెన్స్ సీసీ జట్టు 19 పరుగులకే ఆలౌటైంది.
ఇది రెండో అత్యల్ఫ స్కోరు కాగా, మూడో అత్యల్ప స్కోరు 1974లో నమోదైంది. యార్క్ షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ జట్టు 23 పరుగులకే కుప్పకూలింది. ఇక, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్ ఓపెనర్లు టీకే భండారీ, జతీందర్ సింగ్‌లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరగా, మిగతా ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఒమన్ జట్టు తరుపున ఖవర్ అలీ(15) ఒక్కడే రెండంకెల స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో రుద్రి స్మిత్, ఆడ్రియన్ నెయిల్‌లు తలో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం 25 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ వికెట్లేమీ కోల్పోకుండా 3.2 ఓవర్లలో ఛేదించింది.