శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (103 నాటౌట్; 103 బంతుల్లో, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం బాదాడు. ఓపెనర్ బెన్ డకెట్ (86; 79 బంతుల్లో, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా మొదటి రోజు ఆట 44 ఓవర్లపాటే సాగింది.
అయితే సెంచరీ సాధించిన ఒలీ పోప్ అరుదైన రికార్డు సాధించాడు. 147 టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి ఇప్పటివరకు సాధ్యంకానీ రికార్డు అందుకున్నాడు. ఇంతకీ పోప్ ఏం సాధించాడంటే.. 26 ఏళ్ల పోప్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటివరకు 48 టెస్టులు ఆడాడు. 85 ఇన్నింగ్స్‌ల్లో 34 సగటుతో 2720 పరుగులు చేశాడు. ఇందులో ఏడు శతకాలు, 13 అర్ధశతకాలు ఉన్నాయి. ఓ సెంచరీని డబుల్ సెంచరీగా కూడా మలిచాడు.

అయితే అతను ఏడు శతకాలను వేర్వేరు దేశాలపై సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు తమ తొలి ఏడు శతకాలను ఏడు విభిన్న దేశాలపై సాధించడం ఇదే ప్రథమం. భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక జట్లపై పోప్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. పోప్ ఈ అరుదైన రికార్డుతో పాటు మరో ఘనత సాధించాడు.
టెస్టు క్రికెట్‌లో వేగంగా శతకం సాధించిన రెండో ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఒలీ పోప్ రికార్డులకెక్కాడు. అగ్రస్థానంలో గ్రహమ్ గూచ్ ఉన్నాడు. 1990లో లార్డ్స్ వేదికగా భారత్‌పై గ్రహమ్ 95 బంతుల్లో శతకం అందుకున్నాడు. లంకపై పోప్ 102 బంతుల్లో సెంచరీ చేశాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో ఇప్పటికే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
తొలి టెస్టులో అయిదు వికెట్ల తేడాతో, రెండో టెస్టులో 190 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. ఇక మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ శుభారంభం చేసింది. కాగా, ప్రస్తుతం క్రీజులో ఒలీ పోప్‌తో పాటు హ్యారీ బ్రూక్ (8 నాటౌట్; 14 బంతుల్లో, 1 ఫోర్) ఉన్నారు. లంక బౌలర్లలో లాహిరు కుమార రెండు వికెట్లు, రత్నాయకె ఓ వికెట్ తీశారు.