క్రికెట్‌లో ఎన్నో రూల్స్ ఉన్నాయి. అయితే కొందరు ఆటగాళ్లు మాత్రం ఇంకొన్ని రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది అంటారు. అలాంటి వారిలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఒకడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాటను మరోసారి చెప్పాడు హిట్‌మ్యాన్. క్రికెట్‌ను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చడానికి ఒక్క రూల్ కావాలంటే ఏం చేస్తావు? అనే ప్రశ్న రోహిత్‌కు ఎదురైంది.
దీనికి బదులిచ్చిన రోహిత్ తానైతే 90 మీటర్లు వెళ్లిన సిక్సర్‌కు 8 పరుగులు, 100 మీటర్లు వెళ్లిన సిక్సర్‌కు 10 పరుగులు ఇవ్వాలని అన్నాడు రోహిత్. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో ప్రస్తుతం రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (553) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉండగా.. 551 సిక్సర్లతో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సందర్భంగా గేల్ ఆటతీరును రోహిత్ మెచ్చుకున్నాడు.

గేల్ చాలా ఈజీగా సిక్సర్లు బాదేస్తాడని, తమాషాకి 100 మీటర్ల సిక్సర్లు బాదేస్తాడని రోహిత్ అన్నాడు. 'ఒక బ్యాటర్ 90 మీటర్ల సిక్సర్ బాదితే 8 పరుగులివ్వాలి. అదే 100 మీటర్ల సిక్సర్ అయితే 10 పరుగులు ఇవ్వాలి. అంత దూరం వెళ్లే సిక్సర్లు బాదినందుకు వాళ్లకు ఏదో ఒక బహుమానం ఉండాలి కదా. బంతి కేవలం బౌండరీ లైన్ అవతల పడినా.. చాలా దూరం వెళ్లినా ఇప్పుడు కేవలం ఆరు పరుగులే ఇస్తున్నారు' అని తన డిసప్పాయింట్‌మెంట్‌ను వెల్లడించాడు.
'క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి ప్లేయర్లు చాలా ఈజీగా 100 మీటర్ల సిక్సర్లు బాదేస్తారు. మేం సింపుల్‌గా బంతిని లాఫ్ట్ చేస్తాం. అది వెళ్లి బౌండరీ లైన్ అవతల పడుతుంది. అప్పుడు కూడా ఆరు పరుగులే వస్తాయి. ఇది గేల్, పొలార్డ్ వంటి వాళ్లకు అన్యాయం కదా' అని రోహిత్ చెప్పాడు.