పసికూన అనుకున్న జట్లు అద్భుతమైన విజయాలు సాధిస్తే.. ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. తాజాగా వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో అలాంటి సీన్స్ వరుసగా కనిపించాయి. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్‌లు అన్నింటిలో పోటీ పడిన వెస్టిండీస్ జట్టు ఈ సారి వన్డే వరల్డ్ కప్‌కు అర్హత సాధించేలా కనిపించడం లేదు. కొన్నిరోజుల క్రితం జింబాబ్వే చేతిలో ఘోరంగా ఈ టీం ఓడిన సంగతి తెలిసిందే.
జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో జింబాబ్వే చేతిలో ఏకంగా 35 పరుగుల తేడాతో విండీస్ చిత్తయింది. ఆ ఓటమిని విండీస్ ఫ్యాన్స్ జీర్ణించుకోకముందే.. మరో పసికూన చేతిలో వెస్టిండీస్ చిత్తుగా ఓడింది. ఆ టీం ఏదో కాదు నెదర్లాండ్స్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోరే చేసింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. నికోలస్ పూరన్ (105), బ్రాండన్ కింగ్ (76), జాన్సన్ చార్లెస్ (54) రాణించడంతో ఏకంగా 374 పరుగులు చేసింది. ఈ స్కోరు చూసిన వాళ్లంతా కూడా ఈ మ్యాచ్ కచ్చితంగా విండీస్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ నెదర్లాండ్స్ వేరే ప్లాన్ వేసింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్ భారీ షాట్లు ఆడేందుకే ప్రయత్నించాడు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు చెలరేగారు.
తేజ నిడమనూరు ఏకంగా 111 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (67) కూడా రాణించాడు. దీంతో నెదర్లాండ్స్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 374 పరుగులు చేసింది. రెండు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఆల్‌రౌండర్ లోగన్ వాన బీక్‌ను పంపింది. జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో లోగన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఏకంగా మూడు సిక్సులు, మూడు ఫోర్లు బాదిన లోగన్.. సూపర్ ఓవర్లో 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 31 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌కు బంతితో కూడా లోగన్ చుక్కలు చూపించాడు. కేవలం 8 పరుగులే ఇచ్చి జాన్సన్ చార్లెస్ (7), రొమేరో షెఫర్డ్ (0) ఇద్దర్నీ పెవిలియన్ చేర్చాడు. దీంతో నెదర్లాండ్స్ టీం విజయ సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఓటమితో విండీస్ వరల్డ్ కప్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి.