ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది లెజెండరీ ప్లేయర్లు ఉన్నారు. కానీ వాళ్లందరూ వరల్డ్ కప్ ముద్దాడలేకపోయారు. టీమిండియా లెజెండ్ సౌరవ్ గంగూలీ, సౌతాఫ్రికా దిగ్గజం గ్రేమ్ స్మిత్.. ఇలా ఎందరో ఆటగాళ్లు తాము చేయాల్సిందంతా చేసినా వరల్డ్ కప్‌ను మాత్రం అందుకోలేకపోయారు. ఈ ఏడాది చివర్లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఆ లెజెండ్స్‌ను ఒకసారి గుర్తుచేసుకుంటే..
గ్రేమ్ స్మిత్: సౌతాఫ్రికా లెజెండరీ కెప్టెన్లలో గ్రేమ్ స్మిత్ ఒకడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం అతనికి దక్కింది. 2007 వరల్డ్ కప్‌లో టీంను సెమీఫైనల్ వరకు తీసుకెళ్లిన అతను.. ట్రోఫీ అందించలేకపోయాడు. ఇక 2011 వరల్డ్ కప్‌లో కూడా సెమీస్ చేరినా కివీస్ చేతిలో ఆ టీం ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ గెలవకుండానే స్మిత్ తన కెరీర్ ముగించాల్సి వచ్చింది.

బ్రెండన్ మెకల్లమ్: బాజ్‌బాల్‌తో టెస్టులకు సరికొత్త రూపం అందించిన బ్రెండన్ మెకల్లమ్.. తను ఆడే సమయంలో కూడా అద్భుతమైన లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపించాడు. 2002లో అరంగేట్రం చేసిన అతను 2003, 2007, 2011, 2015 వరల్డ్ కప్‌లలో ఆడాడు. వీటిలో 2007, 2011 వరల్డ్ కప్‌లలో సెమీస్ చేరిన కివీస్ జట్టు.. శ్రీలంక చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. అయితే 2015లో ఫైనల్ చేరినా ఆసీస్ చేతిలో ఓడిపోయింది.
సౌరవ్ గంగూలీ: టీమిండియా లెజెండరీ కెప్టెన్లలో గంగూలీ ఒకడు. అతని కెప్టెన్సీలో 2003 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన తీరు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఆ టోర్నీ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిపోయిన విధానం కూడా ఇప్పటికీ బాధిస్తుంది. గంగూలీ కెప్టెన్సీలో వరల్డ్ కప్‌కు అతి చేరువగా భారత్ వచ్చింది అప్పుడే. కానీ దాన్ని అందుకోవంలో ఫెయిలైంది. తన కెరీర్‌లో మూడు వరల్డ్ కప్‌లు ఆడిన గంగూలీ.. ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు.
బ్రయాన్ లారా: వెస్టిండీస్ తరఫున ఆడిన లెజెండరీ ప్లేయర్లలో బ్రయాన్ లారా ఒకడు. తన కెరీర్‌లో లారా 1992, 1996, 1999, 2003, 2007 మొత్తం ఐదు వరల్డ్ కప్‌లు ఆడాడు. వీటిలో 1996లో విండీస్ జట్టు ట్రోఫీకి చేరువగా వచ్చింది. కానీ సెమీఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఐదు పరుగులతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే విండీస్ క్రికెట్ కష్టాల్లో ఉన్న సమయంలో లారా మాత్రం అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.
జాక్వెస్ కలిస్: క్రికెట్ గురించి తెలిసిన చాలా మంది తమ ఆల్‌టైం ఫేవరెట్ ఆల్‌రౌండర్‌గా ఎంచుకునే ప్లేయర్ జాక్వెస్ కలిస్. ఈ సౌతాఫ్రికా లెజెండ్ తన టైంలో అద్భుతంగా రాణించాడు. వన్డేలు, టెస్టుల్లో పది వేలకుపైగా పరుగులు చేశాడు. కానీ తన కెరీర్‌లో ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ను ముద్దాడలేకపోయాడు. 1999, 2007లో సెమీఫైనల్ చేరిన జట్టులో కలిస్ సభ్యుడు. కానీ ఆ రెండుసార్లు ఆసీస్ చేతిలో ఓడిన సఫారీలు ఇంటిదారి పట్టారు.
రాహుల్ ద్రావిడ్: క్రికెట్‌లో అత్యంత డిసిప్లిన్ ఉన్న ఆటగాళ్లలో రాహుల్ ద్రావిడ్ ఒకడు. అతని టెక్నిక్ చూసిన చాలా మంది ద్రావిడ్‌కు దాసోహం అన్నారు. ప్రపంచంలో దాదాపు అన్ని చోట్లా పరుగులు చేసిన రికార్డు ద్రావిడ్‌కు ఉంది. కానీ తన సహచరుడు గంగూలీలాగే ద్రావిడ్ కూడా ఒక్క వరల్డ్ కప్ కూడా అందుకోలేదు. తన కెరీర్‌లో మూడు వరల్డ్ కప్‌లు ఆడిన ద్రావిడ్.. 2003లో ఫైనల్ చేరిన జట్టులో కీలక పాత్ర పోషించాడు. కానీ ట్రోఫీ మాత్రం ముద్దాడలేకపోయాడు.
ఏబీ డివిలియర్స్: ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్న మరో సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్. తన కెరీర్‌లో మూడు వరల్డ్ కప్‌లు ఆడిన డివిలియర్స ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. 2007, 2015 టోర్నీల్లో సెమీఫైనల్ వచ్చిన జట్టులో అతను కూడా ఒక సభ్యుడు. 2015లో అయితే టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా బరిలో దిగిన ఆ జట్టు సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమి ప్రభావం డివిలియర్స్‌పై చాలానే పడింది.
షాన్ పొలాక్: ఈ జాబితాలో ఉన్న మరో సౌతాఫ్రికా లెజెండ్ షాన్ పొలాక్. 1996లో అరంగేట్రం చేసిన పొలాక్ ఆ ఏడాది జరిగిన వర్లడ్ కప్‌లో ఆడాడు. కానీ వాళ్ల టీం ట్రోఫీ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. తన కెరీర్‌లో పొల్లాక్ మొత్తం నాలుగు వరల్డ్ కప్‌లు ఆడాడు. 1999, 2007లో సెమీఫైనల్ వరకు వచ్చిన జట్టులో పొలాక్ ఉన్నాడు. ఆ తరంలో బెస్ట్ మీడియం పేసర్లలో ఒకడిగా పేరొందినా కూడా.. పొలాక్ కెరీర్‌లో వరల్డ్ కప్ లేకపోవడం అతి పెద్ద లోటుగానే మిగిలింది.
అనిల్ కుంబ్లే: టీమిండియా బెస్ట్ స్పిన్నర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. తన కెరీర్లో నాలుగు వరల్డ్ కప్‌లు ఆడిన కుంబ్లే ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. 1996లో శ్రీలంక చేతిలో ఓడిపోయిన జట్టులో కుంబ్లే సభ్యుడు. ఇక 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో కుంబ్లేను అప్పటి కెప్టెన్ గంగూలీ ఆడించలేదు. ఈ రెండుసార్లలో ఒక్కసారైనా కప్పు కొట్టి ఉంటే ఈ లెజెండరీ స్పిన్నర్ కెరీర్‌లో ఎలాంటి లోటు ఉండేది కాదు.
వకార్ యూనిస్: పాకిస్తాన్ లెజెండరీ పేసర్లలో వకార్ యూనిస్ ఒకడు. వసీమ్ అక్రమ్‌తో కలిసి అతను పాక్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ 1992 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో వకార్ లేడు. ఆ సమయంలో వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఆ తర్వాత మూడు వరల్డ్ కప్‌లు ఆడిన ఈ పాక్ లెజెండ్.. 2003లో తమ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ టీంను కనీసం సూపర్ సిక్స్ స్టేజ్ కూడా దాటించలేక తడబడ్డాడు. దీంతో వరల్డ్ కప్ లేకుండానే కెరీర్ ముగించాడు.