ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో హైదరాబాద్‌కు అన్యాయం జరిగింది. వరల్డ్ కప్‌లో ఆతిథ్యం ఇచ్చే ప్రతి స్టేడియంలో కనీసం నాలుగు మ్యాచులు జరుగుతున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం కేవలం మూడు మ్యాచులే నిర్వహిస్తున్నారు. ఈ మూడూ కూడా క్వాలిఫైయర్ టీమ్స్‌తో జరిగేవే కావడం గమనార్హం. అందునా రెండు పాక్ ఆడే మ్యాచులు. మరొకటి న్యూజిల్యాండ్ ఆడే మ్యాచ్.
మిగతా వేదికల్లో ఏది చూసుకున్నా.. ఢిల్లీ, ధర్మశాల, అహ్మదాబాద్, పూణే, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, లక్నో, చెన్నై ప్రతి చోటా కనీసం నాలుగు మ్యాచులు జరుగుతున్నాయి. కొన్ని స్టేడియాల్లో అయితే ఐదేసి మ్యాచులు షెడ్యూల్ చేశారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం అతి తక్కువగా మూడు మ్యాచులే ఏర్పాటు చేయడం తెలుగు ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. ఇంకో విషయం ఏంటంటే.. టోర్నీ మొదలైన వారం రోజుల్లోనే హైదరాబాద్ షెడ్యూల్ ముగుస్తుంది.

అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిల్యాండ్‌తో ఈ టోర్నీ మొదలవుతుంది. ఆ తర్వాత 6వ తేదీన పాకిస్తాన్, క్వాలిఫైయర్-1తో హైదరాబాద్‌లో తలపడుతుంది. అనంతరం 9వ తేదీన న్యూజిల్యాండ్, క్వాలిఫైయర్-1 జట్లు కూడా ఇక్కడే పోటీ పడతాయి. ఆ తర్వాత 12న మరోసారి పాకిస్తాన్ ఇక్కడకు వస్తుంది. హైదరాబాద్ వేదికగా క్వాలిఫైయర్-2ను ఢీకొంటుంది.
అంతే, ఈ మూడు మ్యాచులతో హైదరాబాద్ షెడ్యూల్ ముగుస్తుంది. వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్ ఉందా? అంటే.. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్-1 లేదా క్వాలిఫైయర్-2గా వస్తే.. పాక్‌తో వారి మ్యాచ్ చూడొచ్చు. ఇక పసికూనతో కివీస్ మ్యాచ్‌పై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఆ మ్యాచ్‌లో 90 శాతం విజయం కివీస్‌దే అని ఫ్యాన్స్ నమ్మకం. ఇలాంటి మ్యాచులే హైదరాబాద్‌లో నిర్వహించడంపై తెలుగు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మినహా అన్ని స్టేడియాల్లో టీమిండియా ఆడుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్.. టీమిండియా మ్యాచుల కోసం హెచ్‌సీఏ పోరాడాల్సిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం హెచ్‌సీఏ ఉన్న పరిస్థితుల్లో అవేమీ సాధ్యం కాదని కూడా కొందరు అంటున్నారు. అసలే ఫ్యాన్స్‌లో హెచ్‌సీఏపై నెగిటివిటీ ఉందని, ఇప్పుడు అది ఇంకా పెరుగుతుందని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ రుచించలేదనే మాట మాత్రం వాస్తవం.