ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమిపాలై కప్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆద్యంతం ఓటమెరుగని టీమిండియా తుదిపోరులో బోల్తాపడింది. ఆస్ట్రేలియా చేతిలో పరాజాయన్ని చవిచూసి పుష్కరకాల కప్ కలను కలగానే మిగిలిచ్చింది.
అయితే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ తయారీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర ఉందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఫైనల్‌కు ముందు వరుసగా మూడు రోజులు రోహిత్-ద్రవిడ్ పిచ్‌ను పరిశీలించారని, పిచ్ మార్పులో వాళ్లకు భాగస్వామ్యం ఉందని కైఫ్ పేర్కొన్నాడు. కమిన్స్, స్టార్క్ కోసం వేసిన ఉచ్చులో టీమిండియాను చిక్కుకుందని అన్నాడు.

''ప్రపంచకప్ ఫైనల్‌కు మూడు రోజుల ముందు ప్రతి సాయంత్రం వరుసగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ పిచ్‌ను పరిశీలించడానికి వచ్చారు. పిచ్ కలర్ మారడం నేను చూశాను. నేను అహ్మదాబాద్‌లో ఆ మూడు రోజులూ ఉన్నాను. ప్రత్యర్థి జట్టులో కమిన్స్, స్టార్క్ ఉన్నారు. వాళ్లకు స్లో పిచ్ ఇవ్వాలని భావించి తప్పు చేశారు. పిచ్‌ను క్యురేటర్లు తయారుచేస్తారని, అందులో మన భాగస్వామ్యం ఉండదని అంటుంటారు. కానీ అదంతా అబద్ధం'' అని కైఫ్ పేర్కొన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. డ్రై వికెట్‌గా భావించి, అలాగే రాత్రి మంచు ప్రభావం ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ఆ సమయంలో మాట్లాడుతూ.. తాము తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నామని, భారీ స్కోరు సాధించి లక్ష్యాన్ని నిర్దేశించాలనుకున్నామని అన్నాడు. కానీ కట్ చేస్తే.. టీమిండియా అభిమానులకు హార్ట్ బ్రేక్.
టీమిండియాపై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఓటమి అనంతరం మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అహ్మదాబాద్ పిచ్‌ను ఆతిథ్య జట్టు భారత్ కంటే ఆస్ట్రేలియానే బాగా అర్థం చేసుకుందని కామెంట్లు చేశారు. కానీ పిచ్ తయారీలో మనోళ్ల భాగస్వామ్యం ఉందని తాజాగా మహ్మద్ కైఫ్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.