భారత్‌లో క్రికెట్ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మన దేశంలో క్రికెట్ ట్యాలెంట్‌కు కొదవ కూడా లేదు. ఐపీఎల్‌లో ప్రతి ఏటా కొత్త కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తూ తమ ట్యాలెంట్ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇంత ట్యాలెంట్ ఉన్నా కూడా ఐసీసీ టోర్నీ గెలవడానికి మాత్రం భారత్ వల్ల కావడం లేదు.
అప్పుడెప్పుడో ధోనీ హయాంలో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో సెమీస్, ఫైనల్స్ వెళ్తోంది కానీ గెలవడం లేదు. దీనికి కారణం ఏంటి? అంటే ఒక్కటి కాదు. చాలా కారణాలు కనిపిస్తాయి. ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం, సరైన టైంలో చెత్త షాట్లు ఆడటం ఇలాంటి కారణాలు బోలెడు కనిపిస్తాయి. కానీ సరిగ్గా గమనిస్తే ప్రధానంగా మూడు కారణాలను ఎత్తిచూపొచ్చు. అవేంటంటే..

టీం సెలెక్షన్..:భారత జట్టుకు అతిపెద్ద సమస్యగా మారిన అంశం జట్టు ఎంపికే. తాజాగా ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. అశ్విన్‌కు బదులు ఉమేష్‌ను ఆడించడం వెనుక లాజిక్ ఎవరికీ తెలీదు. అశ్విన్ ఆడి ఉంటే బంతితో రాణించడంతోపాటు బ్యాటుతోనూ విలువైన పరుగులు చేసేవాడనేది కాదనలేని సత్యం.
ఇక బ్యాటుతో ఏమాత్రం ఆకట్టుకోని భరత్ స్థానంలో ఇషాన్‌ను ఆడిస్తే బాగుండేదని చాలా మంది నిపుణుల అభిప్రాయం. ఈ సమస్య భారత్‌కు ఇప్పటిది కాదు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో అంబటి రాయుడు స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేయడం ఎంత బ్లండరో ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు.
అలాగే 2014, 2016 టీ20 వరల్డ్ కప్‌లలో ఫామ్ లేని యువరాజ్‌ను ఆడించడం కూడా జట్టును దెబ్బతీసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా యువీని ఎంపిక చేసినా అతను ఏమాత్రం రాణించలేదు. దీంతో జట్టు బాగా దెబ్బతిన్నది. ఇక 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌లలో సరైన రిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా జట్టుకు నష్టమే చేసింది. ఇలాంటి తప్పులే చేస్తే 2023 వన్డే వరల్డ్ కప్ కూడా భారత్ చేజారడం ఖాయం.
కీలక ప్లేయర్లకు గాయాలు..:డబ్ల్యూటీసీ ఫైనల్ చూసిన ప్రతి ఒక్కరూ జస్‌ప్రీత్ బుమ్రా లేని లోటును ఫీలయ్యారు. అతనే కాదు రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కూడా లేకపోవడం భారత జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీసింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ అనేది బీసీసీఐ ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. గాయాలతో కీలక ఆటగాళ్లు లేని భారత్ ఏమాత్రం రాణించిందో కనిపిస్తూ ఉంది కదా.

ఐపీఎల్ చివరి వరకు ఆడిన భారత ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చాలా అలిసిపోయి కనిపించారు. ముఖ్యంగా బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఎక్కడా తమ ఎగ్రెషన్ చూపించలేదు. కోహ్లీ హయాంలో ఆటగాళ్ల ఎగ్రెషన్, గెలవాలనే తపన ఏ స్థాయిలో ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అది మచ్చుకు కూడా కనిపించలేదంటే వాళ్లు ఎంతలా అలిసిపోయి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

విరాట్ కోహ్లీ ఎఫెక్ట్..:భారత సీనియర్ జట్టులో అరంగేట్రం చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఎంత అద్భుతంగా రాణిస్తూ వచ్చాడో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కీలకమైన సమయాల్లో అతనిపై భారత జట్టు మరీ ఎక్కువగా ఆధారపడిపోతోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలు చూసుకుంటే.. 2014, 2016, 2021, 2022 టీ20 వరల్డ్ కప్ కీలక మ్యాచుల్లో జట్టు విజయం కోసం అతనిపై ఆధారపడాల్సి వచ్చింది.
టీమిండియా మరీ ఎక్కువగా టాపార్డర్‌పై ఆధారపడటం వల్ల ఈ జట్టు ఐసీసీ టోర్నీల్లో విఫలం అవుతోంది. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో పరిస్థితి అలా లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీసీఐ కళ్లు తెరిచి బలమైన జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒకరిద్దరు ప్లేయర్లపైనే ఆధార పడితే ఐసీసీ ట్రోఫీ నెగ్గడం ఇక జన్మలో జరగదు.
బేసిక్స్ మర్చిపోవడం..:మంచి ఒత్తిడి పెరిగిన సమయంలో భారత ఆటగాళ్లు తెల్లమొఖం వేస్తున్నారు. కనీసం బేసిక్స్ మర్చిపోతున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్, పుజారా, కోహ్లీ ఆడిన షాట్లు చూస్తే వాళ్లు బేసిక్స్ పక్కన పెట్టేసినట్లు అర్థం అవుతుంది. సాలిడ్ డిఫెన్స్ ఆడాల్సిన చోట చెత్త షాట్లకు ప్రయత్నించి పెవిలియన్ చేరారు వీళ్లు.
ఇది ఈ ఒక్క మ్యాచ్‌లో జరిగిన ఘటన కాదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఫకర్ జమాన్‌కు బుమ్రా నోబాల్ వేశాడు. అతను అవుటైనా నోబాల్ కావడంతో బతికిపోయి సెంచరీ చేశాడు. అతని వల్లే పాక్ ఆ మ్యాచ్ గెలిచింది. ఇక 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో విండీస్‌పై అశ్విన్, హార్దిక్ ఇద్దరూ వేసిన నోబాల్స్.. భారత్ విజయావకాశాలకు గండికొట్టాయి. ఇలా ఒత్తిడిలో తప్పులు చేయడం కూడా టీమిండియా మానుకోవాలి.