క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది. అదే 'క్యాచెస్ విన్ యూ మ్యాచెస్' అంటే క్యాచులే మ్యాచులు గెలిపిస్తాయని. అందుకే ఎవరైనా ఆటగాడు క్యాచులు మిస్ చేస్తే ఫ్యాన్స్ తిట్టిపోస్తారు. అదే సమయంలో ఒక్కో ప్లేయర్ వైపు బంతి గాల్లో వెళ్తే కచ్చితంగా అవుటే అని ముందే సంబరాలు మొదలు పెట్టేస్తారు.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ వంటి వాళ్లు చాలా అరుదుగానే క్యాచులు నేలపాలు చేస్తారు. అందుకే వాళ్ల వైపు క్యాచులు వెళ్తే ఫ్యాన్స్ పెద్దగా భయపడరు. అదే సమయంలో మరికొందరి వైపు బంతి వెళ్తుంటే టెన్షన్‌తో చచ్చిపోతారు. 2019 వరల్డ్ కప్ తర్వాత వన్డేల్లో భారత్ తరఫున అత్యంత ఎక్కువ క్యాచులు అందుకున్నది, నేలపాలు చేసింది ఎవరో చూస్తే టీమిండియాలో బెస్ట్ క్యాచర్లు ఎవరో తెలుస్తుంది. వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ లెక్కలు జట్టుకు చాలా ఉపయోగపడతాయి కూడా.

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. 2019 వరల్డ్ కప్ ఆడలేదు. ఆ తర్వాత వన్డే అరంగేట్రం చేసిన ఈ స్టార్ వన్డేల్లో 10 క్యాచులు జారవిడిచి, 20 క్యాచులు అందుకున్నాడు. ఇక భారత జట్టులో బెస్ట్ ఫీల్డర్‌గా పేరున్న విరాట్ కోహ్లీ.. ఈ సమయంలో కేవలం ఐదు క్యాచులు నేలపాలు చేశాడు. అదే సమయంలో 24 క్యాచులు పట్టేశాడు. అతని క్యాచ్‌ల సక్సెస్ రేటు 80 శాతంపైగా ఉండటం గమనార్హం.
కోహ్లీతోపాటు కేఎల్ రాహుల్ కూడా బెస్ట్ క్యాచర్లలో ఒకడిగా ఉన్నాడు. అతను ఈ సమయంలో కేవలం నాలుగు క్యాచులే జారవిడిచాడు. అలాగే 24 క్యాచులు అందుకున్నాడు. అతని సక్సెస్ రేటు 85 శాతంగా ఉంది. గిల్ ఆరు క్యాచులు వదిలేసి, 17 అందుకున్నాడు. సిరాజ్ ఐదు అందుకొని, ఐదు జారవిడిచాడు. ధవన్ అయితే ఐదు జార విడిచి, 22 క్యాచులు అందుకున్నాడు.
శ్రేయాస్ అయ్యర్ 4 క్యాచులు నేలపాలు చేసి, 16 క్యాచులు అందుకున్నాడు. సంజూ శాంసన్ నాలుగు జారవిడిచి, 7 క్యాచులు పట్టేశాడు. ఇక కెప్టెన్ రోహిత్ నాలుగు క్యాచులు వదిలేశాడు. అదే సమయంలో 10 క్యాచులు అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ మూడు వదిలేసి, మూడు అందుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా మూడు క్యాచులు నేలపాలు చేశాడు. అయితే అతను 8 క్యాచులు కూడా పట్టుకున్నాడు.
మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా మూడు క్యాచులు నేలపాలు చేశాడు. అలాగే 7 క్యాచులు ఒడిసి పట్టాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం మూడు క్యాచులు నేలపాలు చేసి, ఒక్కటంటే ఒక్క క్యాచ్ కూడా అందుకోలేదు. దీన్ని బట్టి చూస్తే టీమిండియాలో కోహ్లీ, రాహుల్, ధవన్, శ్రేయాస్ అయ్యర్ బెస్ట్ క్యాచర్లని అర్థం అవుతోంది.