ఈ ఏడాది చివర్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఈ వరల్డ్ కప్‌లో తాము ఆడే రెండు మ్యాచుల వేదికలు మార్చాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది. అయితే ఈ అభ్యర్థనను బీసీసీఐతోపాటు ఐసీసీ కూడా నిర్దాక్షిణ్యంగా నిరాకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీకి కూడా చెప్పేశారట.
కొన్ని రోజుల క్రితమే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ డ్రాఫ్ట్‌ను బీసీసీఐ రెడీ చేసింది. దీన్ని ఐసీసీకి పంపింది. దీనిపై అభిప్రాయాలు తెలపాలని ఐసీసీ సభ్య దేశాలను కోరింది. ఈ షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తలపడతాయి. అలాగే పాక్, ఆసీస్ మధ్య మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు వేదికలపై పాక్ అసంతృప్తిగా ఉంది.

చెపాక్‌లో స్పిన్నర్లు ఎక్కువగా రాణిస్తారనే సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లను ఈ పిచ్‌పై ఎదుర్కోవడానికి పీసీబీ భయపడుతుందని కొందరు అంటున్నారు. అలాగే బిగ్ హిట్టర్లున్న ఆస్ట్రేలియాతో చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి కూడా ఆలోచిస్తోందట. ఈ రెండు వేదికలను మార్చాలని, కావాలంటే ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ను బెంగళూరులో, ఆసీస్‌తో మ్యాచ్‌ను చెన్నైలో నిర్వహించాలని పీసీబీ కోరింది.
ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీ సమావేశమై చర్చించాయి. నిబంధనల ప్రకారం చూసుకుంటే వేదికలు నిర్ణయించే హక్కు ఆతిథ్య దేశానికి ఉంటుంది. వేదికలు మార్చాలంటే ఐసీసీ ఆమోదం తప్పనిసరి. అయితే ఐసీసీ సరైన కారణం లేకుండా వేదికలు మార్చడానికి అంగీకరించదు. ఏవైనా భద్రతా కారణాలు ఉంటేనే వేదికలు మార్చాలంటుంది. మరే ఇతర కారణాలకూ దాదాపు మార్చరు.
ఈ క్రమంలోనే పాకిస్తాన్ వద్ద సరైన కారణం ఏదీ లేదని, అలాంటప్పుడు వేదికలు మార్చడం కుదరదని ఐసీసీ భావించింది. ఇదే విషయాన్ని పీసీబీకి కూడా అధికారికంగా తెలియజేశారట. ఇదిలా ఉండగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనిపై కూడా పీసీబీ కొంత ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఆందోళన కూడా అనవసరమని ఐసీసీ భావించింది. ఈ వేదిక మార్చాలనే రిక్వెస్ట్‌ను కూడా కొట్టిపారేసింది. ఈ మ్యాచుల వేదికలు మార్చడానికి సరైన కారణం ఒక్కటి కూడా కనిపించడం లేదని ఐసీసీ, బీసీసీఐ రెండూ స్పష్టంగా పీసీబీకి చెప్పేశాయట. అయితే సరైన కారణం ఉంటే వేదికను మార్చడం కష్టమేమీ కాదు. గతంలో 2016 టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ వేదికను భద్రతా కారణాల దృష్ట్యా మార్చారు. ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ను కోల్‌కతాకు షిఫ్ట్ చేశారు.