పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే అయిదు టీ20ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ మెరపు శతకం బాదాడు. 62 బంతుల్లో 137 పరుగులు చేశాడు. కివీస్ తరపున టీ20ల్లో వ్యక్తిగత అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 224 పరుగులు చేసింది. అయితే కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కాన్వాయ్ (7)ను హారిష్ రవూఫ్ ఔట్ చేశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టీఫెర్ట్ (31; 23 బంతుల్లో) కలిసి ఫిన్ అలెన్ శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో అలెన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా అతడు అయిదు ఫోర్లు, 16 సిక్సర్లు సాధించాడు.

హారిష్ రవూఫ్ నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. రెండు వికెట్లు తీశాడు. షాహిన్ అఫ్రిది కూడా విఫలమయ్యాడు. 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అయితే ఆఖరి రెండు ఓవర్లలో 13 పరుగులే ఇవ్వడం విశేషం. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (19; 15 బంతుల్లో), డారిల్ మిచెల్ 8 పరుగులు చేశారు.
అనంతరం ఛేదనలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 179 పరుగులే చేసింది. ఓపెనర్ సయిమ్ అయుబ్ (10; 13 బంతుల్లో) ఆదిలోనే ఔటయ్యాడు. మహ్మద్ రిజ్వాన్ (24; 20 బంతుల్లో)తో కలిసి బాబర్ అజామ్ (58; 37 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాబర్ వరుసగా మూడో అర్ధశతకం సాధించాడు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ పాకిస్థాన్ ఒత్తిడిలోకి నెట్టింది.

ఆఖర్లో మహ్మద్ నవాజ్ (28; 15 బంతుల్లో) చేసిన పరుగులు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథి (2/29), శాంట్నర్ (1/26), ఫెర్గూసన్ (1/27) పాకిస్థాన్ స్కోరును కట్టడి చేశారు. జనవరి 19న, జనవరి 21న చివరి రెండు టీ20లు జరగనున్నాయి.